వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతులకు మార్గనిర్దేశం చేయడం, వారి అవసరాలను గుర్తించి తగిన చర్యలు సూచిస్తూ ప్రభుత్వానికి సలహాలనివ్వడమే లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయ మిషన్‌ ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. వైస్‌ఛైర్మన్‌గా వ్యవసాయ నిపుణుడు, ఆక్వా రైతు ఎంవీఎస్‌ నాగిరెడ్డిని నియమిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు.

 

వ్యవసాయ, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్‌, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి డాక్టర్‌ పి.రాఘవరెడ్డి, వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డ్డితోపాటు రైతులనుంచి బోయ నరేంద్ర, జిన్నూరి రామారావు, గొంటు రఘురాం, సీనియర్‌ జర్నలిస్టు పి.సాయినాథ్‌ను సభ్యులుగా నియమించారు.

 

అనంతపురంలోని గ్రామీణాభివృద్ధి ట్రస్టుకు చెందిన ఎకాలజీ కేంద్రం నుంచి నామినీ డైరెక్టర్‌, స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నుంచి ఒకరు, వ్యవసాయ అవసరాలు తీర్చే సరఫరాదారుల నుంచి ఇద్దరు ప్రతినిధులకు కూడా అవకాశమిచ్చారు.  మిషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ను సభ్య కార్యదర్శిగా నియమించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో విడుదల చేయనున్నారు.

 

గత ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయ సంక్షోభం నెలకొందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయానికి సలహామండలిగా వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేందుకు విధాన నిర్ణయాలను రూపొందించే వేదికగా మిషన్‌ పనిచేస్తుందని వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: