ఇపుడిదే చర్చ తెలుగుదేశంపార్టీలో మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల వివాదంలో ఇపుడు బంతి ఎన్నికల సంఘం కోర్టులోకి చేరింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద వైసిపి హవా నడిచినా మూడు పార్లమెంటు స్ధానాల్లో మాత్రం టిడిపి గెలవటమే విచిత్రం అనిపించింది. అందులోను పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో వైసిపి గెలవగా కేవలం ఒకే ఒక్క అసెంబ్లీలో వచ్చిన మెజారిటితో టిడిపి మూడు ఎంపి సీట్లను గెలుచుకోవటం ఆశ్చర్యమనిపించింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే టిడిపి గెలిచిన గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్ సభ సీట్లలో టిడిపి అభ్యర్ధులు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచారు. విచిత్రమేమిటంటే  గుంటూరు, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధులకు వచ్చిన మెజారిటికన్నా రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లే చాలా ఎక్కువ.

 

పై రెండు నియోజకవర్గాల్లో గెలిచిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు కు వచ్చిన మెజారిటి సుమారు 5 వేలు, 6 వేలు మాత్రమే. అయితే గుంటూరులో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు 9780, శ్రీకాకుళంలో సుమారు 7 వేలు కావటం గమనార్హం. రిటర్నింగ్ అధికారులు కుమ్మకైన కారణంగానే పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించినట్లు వైసిపి కేసు వేసింది.

 

పై రెండు నియోజకవర్గాల్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల కవర్ల మీద సీరియల్ నెంబర్లు లేవన్న ఏకైక కారణంతో రిటర్నింగ్ అధికారులు ఓట్లు లెక్కించేందుకు లేదంటూ తిరస్కరించారు. విచిత్రమేమిటంటే ఇదే విధంగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల కవర్లను ఇతర నియోజకవర్గాల్లో మాత్రం లెక్కించారు. నిబంధన అన్నీ నియోజకవర్గాలకు ఒకే విధంగా ఉండాలి కద ? సరిగ్గా ఈ పాయింట్ మీదే వైసిపి కోర్టులో కేసు వేసింది.

 

రెండు వైపుల వాదనలు విన్న న్యాయస్ధానం పోస్టల్ బ్యాలెట్ల అంశంపై ఎన్నికల సంఘం వివరణను కోరింది. పైగా పోస్టల్ బ్యాలెట్లున్న కవర్లపైన సీరియల్ నెంబర్లు వేసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే అన్న నిబంధనను కూడా వైసిపి లాయర్ కోర్టులో వినిపించారు. మరి ఈ పరిస్ధితుల్లో ఎన్నికల సంఘం వివరణ ఏ విధంగా ఉండబోతోందన్నది కీలకమైంది. మొత్తం మీద టిడిపి ఎంపిల్లో టెన్షన్ మొదలైందన్నది మాత్రం వాస్తవం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: