జేఇఓ(తిరుపతి)గా నిన్న ఆంధ్రా ప్రభుత్వం నియమించిన బసంత్‌ కుమార్‌ గురించి తెలుసుకోవాలంటే 5 నెలల క్రితం విశాఖలో జరిగిన ఒక అద్భుతమైన వివాహ కార్యక్రమం గురించి తెలుసుకోవాలి.  అతి సామాన్యుడి ఇంట కూడా పెళ్లికి ఎంత ఖర్చవుతుంది అంటే.. లక్షలు దాటుతుంది.


ఇటీ వల హైదరాబాద్‌లో ఒక సీనియర్‌ జర్నలిస్టు కొడుకు పెళ్లి కోసం అరకోటి ఖర్చుచేశాడు.  ఇక ప్రభుత్వ ఉన్నతాధికారు లైతే తమ హోదాకు తగ్గకుండా లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పట్నాల బసంత్‌ కుమార్‌ అందరిలా కాదు. పెద్ద ఉద్యోగంలో ఉండికూడా తన కుమారుడికి పెళ్లికి కేవలం 18 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు.

విశాఖలోని, విశాలాక్షినగర్‌ ,దయాల్‌నగర్‌కాలనీలో ఉండే బసంత్‌ కుమార్‌..అప్పట్లో విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌  అథారిటీ(వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా పనిచేసేవారు. ఆయన కుమారుడు అభినవ్‌ మానస్‌ వివాహం డాక్టర్‌ లావణ్యతో జరిపారు. ఈ వివాహానికి బసంత్‌కుమార్‌ రూ. 18 వేలు మాత్రమే ఖర్చు చేశారు.

రాధాస్వామి సత్సంగ్‌ నియమాలు పాటించే ఆయన 2017లో కుమార్తె బినతి పెళ్లికి కేవలం రూ.16,100 మాత్రమే ఖర్చుపెట్టారు. కుమారుడి వివాహానికి కూడా ఇదేవిధంగా ఏర్పాట్లు చేశారు.  ఒక్కో పెళ్లి శుభలేఖకు ఐదు రూపాయలు వెచ్చించారు. వందలోపే అతిథులను ఆహ్వానించారు. పుష్పగుచ్చాలు, కానుకలు అంగీకరించబోమని శుభలేఖలో స్పష్టం చేశారు. పురోహితుడికి రూ. 1000, వంటమనిషికి రూ. 500 ఖర్చుచేశారు.

తమ కాలనీలో పండించే తోట నుంచి వంటకు కావాల్సిన కూరగాయాలు తెచ్చుకున్నారు. మొత్తానికి పెళ్లి భోజనం కోసం ఒక్కొక్కరికి కేవలం రూ. 13 ఖర్చయింది. కుమారుడి పెళ్లికి బసంత్‌ కుమార్‌ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకపోవడం విశేషం. ఇంత నిరాడంబరంగా జీవించే ఈ ఐఏఎస్‌ అధికారిని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ ఏరికోరి తిరుపతి జెఈఓగా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: