ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామని అంటే అంగీకరించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలను అడ్డుకుంటామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామన్నారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన భవనాలు పటిష్ఠంగా ఉంటే వాటిని కూల్చేయడం సమంజసం కాదన్నారు.

 

ప్రస్తుత శాసనసభ భవనం రాష్ట్ర ఎమ్మెల్యేల అవసరాలకు సరిపోతున్నపుడు కొత్త అసెంబ్లీ నిర్మాణం అవసరం ఏముందన్నారు. సోమవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో నాయకులబృందం అసెంబ్లీ, సచివాలయంలో అన్ని బ్లాకులను సందర్శించి భవనాలను పరిశీలించింది.

 

ఈ బృందంలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, శాసనసభ్యులు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, కొండేటి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు సచివాలయం, అసెంబ్లీలోని భవనాలను పరిశీలించి ఎప్పుడు నిర్మించారు? ఎవరు ప్రారంభించారు? ఎలా ఉన్నాయి? అని చూశారు.

 

కొత్త సచివాలయం నిర్మిస్తామనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితిల్లోనూ ఒప్పుకోదని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. భవనాల కూల్చివేతను అడ్డుకునేందుకు రావాలంటూ కార్యకర్తలకు పిలుపునిస్తామని, త్వరలో దీన్ని ప్రజాఉద్యమంగా మారుస్తామన్నారు. సచివాలయంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూల్చేందుకు సిద్ధమవుతున్నారని ఇది సబబు కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: