అమెరికాలో కార్మికుల సమ్మెలు, పోరాటాలు పెరుగుతున్నాయి. అతి పెద్ద బహుళజాతి వ్యాపార సంస్థ అమెజాన్‌లో దుర్భర పని పరిస్థితులపై కార్మికులు కన్నెర్ర చేస్తే, శాన్‌ఫ్రాన్సిస్కోలో అన్యాయమైన పని పరిస్థితులు, స్తంభించిన వేతనాలకు వ్యతిరేకంగా పశువుల ఆసుపత్రుల సిబ్బంది ఆందోళన బాట పట్టారు.

 

పని గంటలను పెంచేసి కార్మికులను యజమాన్యం దోపిడీ చేస్తోందని కార్మికులు విమర్శించారు. శాన్‌ఫ్రాన్సిస్కో వెటరినరీ హాస్పిటల్స్‌లో ఉద్యోగులు వేతనాల పెంపు కోసం అన్ని కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. అమెరికా, కెనడాల్లోఈ కంపెనీకి 750 వెటరినరీ హాస్పిటల్స్‌ ఉన్నాయి. అలాగే పని పరిస్థితులు మెరుగుపరచాలని, అదనపు పని గంటలకు అదనంగా చెల్లించాలని కోరుతూ డెల్టా, అమెరికా ఎయిర్‌లైన్స్‌ రాంప్‌ అండ్‌ కార్గో కార్మికులు పోరాడుతున్నారు.

 

విదేశీ వలస కార్మికులపై ట్రంప్‌ దాదాపు యుద్ధమే ప్రకటించారు. వారిని క్రిమినల్స్‌లా చూస్తూ నిర్బంధ శిబిరాల్లో బంధిస్తుండడంపై అంతర్జాతీయ కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులపై ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధా న్ని యావత్‌ కార్మికవర్గంపై జరిగిన దాడిగా పలువురు కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు. సరిహద్దుల్లో ట్రంప్‌ నిర్మించతలపెట్టిన గోడ కార్మికుల మధ్య విభజనకు తెచ్చిందనేని, ఈ గోడ కార్మికులను వేరు చేయొచ్చేమో కానీ, కార్మిక పోరాటాలను మాత్రం వేరు చేయలేదని వారు ఉద్ఘాటించారు.

 

బహుళజాతి కంపెనీ అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా దుర్భర పరిస్థితుల్లో తమ విధులు నిర్వర్తిస్తున్నారని ఆ సంస్థకు చెందిన కొందరు మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.. విధి నిర్వహణలో ఉద్యోగులు తీవ్రగాయాలకు లోనయినా యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డల్లాస్‌లో వున్న డిఎఫ్‌డబ్ల్యు7 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌లో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగిని షనాన్‌ అలన్‌ కంపెనీలో కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను సాక్ష్యాలతో సహా వెల్లడించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: