మొత్తానికి కరకట్టపై చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్ నోరిప్పారు. కూల్చివేత నోటీసుపై లింగమనేని ఇచ్చిన సమాధానం ఒక విధంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చేదిగానే ఉంది. కొద్దిరోజులుగా అధికార-ప్రతిపక్షాల మధ్య వివాదానికి కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ కేంద్రబిందువైన విషయం తెలిసిందే. సదరు నిర్మాణం అక్రమ కట్టడమే అని ప్రభుత్వం అంటుంటే నివాసముంటున్న చంద్రబాబు మాత్రం తాను సక్రమ నిర్మాణంలోనే ఉంటున్నట్లు వాదిస్తున్నారు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే భవనం కూల్చివేతపై భవనం యజమాని లింగమనేనికి ప్రభుత్వం నోటీసిస్తే తెలుగుదేశంపార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నివాసానికి నోటీసులిస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే.

 

రియాక్ట్ అవ్వాల్సిన లింగమనేని కాకుండా చంద్రబాబు మాట్లాడుతుండటంతో అసలు భవనం యజమాని చంద్రబాబే అనే అనుమానం పెరిగిపోయింది అందరిలోను. దాంతో జరిగిన డ్యామేజి గ్రహించిన టిడిపి వెంటనే లింగమనేనిని రంగంలోకి దింపింది. భవనం కూల్చివేతకు ప్రభుత్వం ఇచ్చిన ఏడు రోజుల గడువులో ఏడో రోజు లింగమనేని స్పందించారు.

 

తన గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం కాదన్నారు. గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఉండవల్లి పంచాయితి  నుండి అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ అనుమతులను మాత్రం చూపలేదు. అలాగే, భవనం రెగ్యులజైషన్ కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అసలు తమ భవనం కూల్చివేతకు అధికారాలు లేని వారితో నోటిసులు ఇప్పించినట్లు లింగమనేని ఎదురు తిరిగటం గమనార్హం. అంటే ప్రభుత్వంతో ఘర్షణకు లింగమనేని సిద్ధమైనట్లే ఉంది చూస్తుంటే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: