ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు రావని, ఓడిపోతామని ముందే తెలుసునని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో మాట్లాడిన ఆయన, ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానని అన్నారు.

 

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. తాను తానా సభలకు వెళ్లాలా? వద్దా? అని మదనపడ్డానని, కొందరు వెళ్లాలని, కొందరు వద్దాలని అన్నారని చివరకు వెళ్లాలనే నిర్ణయించుకున్నానని అన్నారు.

 

మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసునని, అయితే, మారే ప్రజల కోసం తాను నమ్మిన మార్గంలోనే నడుస్తానని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే బయట తిరుగుతున్నారని, అటువంటిది తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు.

 

జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎన్నారైలకు పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సైతం తానా సభల్లో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: