తెలంగాణలో ప్రజల బతుకులు బాగు పడాలంటే భాజపా గెలుపు అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రాష్ట్రంలో భాజపా జెండా ఎగరవేస్తామని, అదే తమ ధ్యేయమని వివరించారు. తెలంగాణ సహా, ఏపీ, కేరళలోనూ బలపడతామని ధీమా వ్యక్తంచేశారు. శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ హాల్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి, మురళీధర్‌ రావు, దత్తాత్రేయ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి అమిత్‌ షా మాట్లాడారు. ‘‘భాజపా అఖండ విజయం తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చా. తెలంగాణలోనూ త్వరలో భాజపా జెండా ఎగురవేస్తాం. అదే మా ధ్యేయం.  తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడాలంటే భాజపా గెలవాలి. మొన్నటి ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా భవిష్యత్‌లో అవతరించడం ఖాయం. ఆ దిశగా తెలంగాణ నేతలు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేస్తున్నా’’ అని అమిత్‌ షా అన్నారు.

 

‘‘కొన్ని సిద్ధాంతాల ఆధారంగా భాజపా నడుస్తోంది. భాజపాలో వారసత్వ రాజకీయాలు లేవు. కుటుంబ పాలన లేదు. మేం విజయానికి పొంగిపోలేదు. ఓటమికి కుంగిపోలేదు. ఆ పార్టీ ఓటమిని తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్‌ ఓ కుటుంబంపై ఆధారపడిన పార్టీ. మా వల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్‌కు స్థానం లేకుండా పోయింది. భాజపాలో ప్రతి సభ్యుడికి ప్రాధాన్యం ఉంటుంది.

 

కింది స్థాయి నాయకుడు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం భాజపా కల్పిస్తోంది’’ అని షా అన్నారు. బడ్జెట్‌లో రైతులకు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని,  సమాజంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అందరి సంక్షేమమే భాజపా లక్ష్యమని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. అంతకుముందు పలువురు నేతలు అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: