మ‌న దేశంలో అనేక చిత్ర విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు అప్పుడ‌ప్పుడు వినిపిస్తుంటాయి. ఇలాంటి వ్యాఖ్య‌లు విన్న‌ప్పుడు నిజంగా ఇలా కూడా జ‌రుగుతుందా? అనిఅనిపిస్తుంది. గ‌త కొన్నాళ్ల కింద‌ట బిహార్‌లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ద్యం వ్యాపారం జ‌రిగింది. దీనిపై అప్ప‌టి ఎన్నిక‌ల సంఘం తీవ్ర‌స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఎత్తున కేసుల‌కు కేసుల మ‌ద్యం బాటిళ్ల‌నుస్వాధీనం చేసుకున్నారు. దీనినంత‌టినీ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేష‌న్ల‌కు బ‌దిలీ చేశారు. ఆ త‌ర్వాత మూడు మాసాల‌కు కోర్టు దీనిపై విచార‌ణ చేప‌ట్టింది. స్వాధీనం చేసుకున్న మ‌ద్యం బాటిళ్ల‌ను కోర్టులో జ‌మ చేయాల‌నిన్యాయ‌మూర్తి ఆదేశించారు. దీంతో కోర్టు ప‌రిశీల‌కులు ఆయా పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లి ప‌రిశీలించ‌గా.. అన్నీ ఖాళీ బాటిళ్లే ద‌ర్శ‌న మిచ్చాయి. 


ఒక్క బాటిల్ కూడా మ‌ద్యం వారికి క‌నిపించ‌లేదు. దీనిపై కోర్టు కు వివ‌ర‌ణ ఇచ్చిన పోలీసులు.. మ‌ద్యాన్ని తాము స్వాధీ నం చేసుకున్నామ‌ని, కానీ, స్టేష‌న్ల‌లో ఉన్న ఎలుక‌లు మ‌ద్యాన్ని తాగేశాయ‌ని బ‌దులిచ్చారు. దీంతో దేశం మొత్తం అవాక్క‌యింది. ఇక‌, మ‌రో ఘ‌ట‌న‌లో అదే బిహార్‌లోని ఓ రిజ‌ర్వాయ‌ర్‌కు గండి చేతికి అంది వ‌చ్చిన పంట‌లు పూర్తిగా మునిగి పోయాయి. దీనిపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పందికొక్కులే దీనికి కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. పందికొక్కులు కొట్టేయ‌డం వ‌ల్లే రిజ‌ర్వాయ‌ర్‌కు గండి ప‌డింద‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యం కూడా దేశంలో సంచ‌ల‌నం సృష్టించింది. 


ఇక‌, ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్‌కు గండి పడి 23 మందికి పైగా మరణించారు.  ఇప్పటికీ కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ స్పందిస్తూ.. డ్యామ్ గండి పడటానికి పీతలు కారణమని సావంత్ పేర్కొన్నారు. పీతల వల్లే గోడలు బలహీనపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు కూడా ప్రాథమికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారన్నారు. దీంతో మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెంటనే పీతలను అరెస్ట్ చేయాలని, ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని పీతలను తీసుకొచ్చి థానే పోలీసులకు అందించిన నేతలు.. సిగ్గులేని ప్రభుత్వమంటూ ఫడ్నవీస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మొత్తానికి మ‌న దేశంలో రాజ‌కీయ నేతలు ఎలాంటి వ్యాఖ్య‌లైనా చేయొచ్చు.. అనేందుకు ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: