తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో ఎంత స్నేహంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా తరచూ గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ కు వెళ్లి పరామర్శిస్తుంటారు. రాష్ట్రంలో తీసుకునే కీలక నిర్ణయాలను వివరిస్తారు. గవర్నర్ కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇచ్చి ఖుషీ చేస్తుంటారు.


అందుకే కేసీఆర్ గత ఆరేళ్ల పాలనలో గవర్నర్ తో ఎలాంటి పేచీ లేకుండా సాఫీగా సాగిపోయింది. కానీ ఇకపై అలా సాగదట. తెలంగాణపై కన్నేసిన బీజేపీ ఇక కేసీఆర్ సర్కారును సాఫీగా సాగనీయదట. కేసీఆర్‌ను రాజకీయంగా చికాకు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను సంధించాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు మోదీ, అమిత్ షా నుంచి ఆదేశాలు అందాయట.


మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిని తవ్వి తీస్తారట. వీటితో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు గవర్నర్‌ నరసింహన్‌ను రంగంలోకి దించుతారట. తాజాగా విద్యాశాఖ అధికారులతో పరిస్థితిని గవర్నర్‌ సమీక్షించడం, పోడు భూముల వివాదంపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడటం ఇందుకు ఉదాహరణలుగా విశ్లేషకులు చెబుతున్నారు.


గత ఆదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ సఖ్యతతో ముందుకు సాగారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలను.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని గవర్నర్‌ మందలించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా కేసీఆర్ కు అనుకూలంగా గవర్నర్‌ వ్యవహరించారని వార్తలు వచ్చాయి. అలాంటిది, గవర్నర్‌ వైఖరిలో హఠాత్తుగా ఇప్పుడు ఇంత మార్పుకు కారణం కేంద్రం వైఖరేనా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: