కరకట్ట మీద నివాసానికి సంబంధించి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజావేదిక పక్కన ఉన్న నివాసం అక్రమ కట్టడమంటూ లింగమనేని రమేష్ పేరుతో సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే, అది సక్రమ కట్టడమేనని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే తాము నిర్మించామంటూ లింగమనేని రమేష్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

 

అయితే, దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్త ఆధారాలతో ముందుకు వచ్చారు. గతంలో తాను ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదేనంటూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సాక్షాత్తూ అసెంబ్లీలోనే ప్రకటించారని ఇప్పుడు తమకు సంబంధం లేదంటూ మాట మారుస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

 

అదే సమయంలో ఆ ఇంటితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో లింగమనేని రమేష్ మీడియా ఛానల్స్‌తో మాట్లాడిన వీడియోలు ఉన్నాయన్నారు. లింగమనేని రమేష్‌ను చంద్రబాబు బెదిరించడం వల్లే ఆయన మాట మారుస్తున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి వైఎస్ హయాంలో అనుమతులు ఇచ్చారని చెబుతున్న వారు వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

 

చంద్రబాబు ఉంటున్న ఇంటికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకున్నారా? లేదా అనే విషయంపై అసెంబ్లీ సెక్రటరీని వివరాలు అడిగానని, త్వరలో ఆ వివరాలన్నీ బయట పెడతానన్నారు. కరకట్ట మీద ఏ అక్రమ నిర్మాణాన్ని కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: