ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌కు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. అనేక అంశాల్లో భార‌త్ త‌న ముద్ర వేసుకుంటోంది. అయితే, తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ప్రాంతం మ‌రోమారు భార‌త్ స‌త్తాను చాటింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్(సీపీ)లో ప్రపంచంలో తొమ్మిదో ఖరీదైన స్థలంగా నిలిచింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ తాజాగా వెల్లడించింది. ఇక్కడ ఒక్కో చదరపు అడుగుకు వార్షికంగా 144 డాలర్ల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మన కరెన్సీలో ఇది రూ.10 వేలు. ఢిల్లీ మధ్యలో ఉన్న ఈ స్థలం గతేడాది కూడా తొమ్మిదోస్థానంలో నిలిచింది.


సీబీఆర్ఈ సంస్థ‌ వార్షిక గ్లోబల్ ప్రైమ్ ఆఫీస్ అక్యూపెన్సీ కాస్ట్‌తో అంతర్జాతీయంగా అతి ఖరీదైన కార్యాలయాలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గ‌తేడాదితో పోలిస్తే న్యూఢిల్లీలోని కన్సాట్ ప్లేస్‌లో అద్దె స్వల్పంగా పెరిగినప్పటికీ ర్యాంక్‌లో మాత్రం యథాతథంగా ఉంది. కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను కన్నాట్ ప్లేస్‌లోనే ఏర్పాటు చేయడానికి ఎంతైన వెచ్చించడానికి ముందుకు రావడంతో ఇక్కడ ఆఫీస్ ప్లేస్‌కు డిమాండ్ నెలకొన్నదని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో కమర్షియల్ ఆఫీస్ మార్కెట్ ఎనలేని డిమాండ్ ఉన్నదని, ఢిల్లీలోని ప్రైమ్ మార్కెట్ టాప్-10 అత్యంత ఖరీదైన స్థలంగా నిలిచిందన్నారు. 


ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ర్యాంక్ 27వ స్థానానికి పడిపోగా, నారిమన్ పాయింట్ సీబీడీ కూడా 40వ స్థానానికి జారుకుంది. 2018లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ 26వ స్థానంలో ఉండగా, నారిమన్ పాయింట్ 37వ స్థానంలో ఉంది.  బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒక్కో చదరపు అడుగు అద్దె 90.67 డాలర్లుగా ఉండగా, అదే నారిమన్ పాయింట్‌లో 68.38 డాలర్లుగా ఉంది. హాంకాంగ్‌కు చెందిన సెంట్రల్ డిస్ట్రిక్ వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు అద్దె 322 డాలర్లు. తొలి పది జాబితాలో ఆసియా నుంచి ఆరు స్థలాలకు చోటు లభించింది. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌కు రెండో స్థానం లభించగా, హాంకాంగ్‌లోని కౌలాన్‌కు ఆ తర్వాతి స్థానం, న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మ్యాన్‌హ్యట్టెన్‌కు నాలుగో స్థానం లభించింది. బీజింగ్‌లోని ఫైనాన్స్ స్ట్రీట్‌కు 5వ స్థానం దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: