బడ్జెట్ సమావేశాలు జరిగే 14రోజుల్లో ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాలని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.  40రోజుల వైకాపా పాలనలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. 


విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే... ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చకొచ్చే అంశాలపై శాఖలవారీగా 46పేజీలతో ఓ నివేదికను తెదేపా సిద్ధం చేసుకుంది. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన 15పథకాలను వైకాపా నిలిపివేయటంపై సభలో నిలదీయాలని నిర్ణయించుకుంది. 


గత ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేయడాన్ని తెదేపా తీవ్రంగా పరిగణిస్తోంది.  వైకాపా విడుదల చేసే శ్వేత పత్రాల్లో వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేయనుంది. వివిధ శాఖల్లో 630పైగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించడమే తమప్రభుత్వ పనితీరుకు తార్కాణంగా చెప్పుకోవాలని భావిస్తోంది. 


ఉద్యోగుల మధ్యంతర భృతి విషయంలోనూ మోసపూరిత విధానంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుగుదేశం భావిస్తోంది. వీటితోపాటు వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ చెల్లింపుల్లో జాప్యంపైనా వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తెదేపా సన్నద్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: