కట్టలకొద్దీ డబ్బు.. తులాలకొద్దీ బంగారు ఆభరణాలు.. లెక్కలేనన్ని ఆస్తుల పత్రాలు....ఇవ‌న్నీ ఏవో బ‌డా వ్యాపార‌వేత్త ఇంట్లోని లెక్క‌ల వివ‌రాలు అనుకుంటున్నారా?  కానే కాదు. ఓ ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో దాడులు చేయ‌గా క‌నిపించిన దిమ్మ‌తిరిగే అంశాలు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్‌ లావణ్య ఇంట్లో వెలుగు చూసిన అంశాలు. నోట్ల కట్టలు, బంగారం చూసి సోదాలు చేసిన అధికారుల దిమ్మ‌తిరిగిపోయిందంటే న‌మ్మండి.


తన భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని వేడుకున్న రైతునుంచి ఓ వీఆర్వో రూ.8 లక్షల లంచం డిమాండ్‌చేశాడు. అడ్వాన్స్‌గా రూ. 4లక్షల నగదును సాక్షాత్తు తాసిల్దార్ కార్యాలయంలోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మం డలం దత్తయాపల్లి గ్రామానికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు సర్వే నంబర్ 85/ఆలో 9.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సమస్య పరిష్కారానికి రూ. 8 లక్షలు లంచం ఇవ్వాలని, ఇందులో తాసిల్దార్ మునావత్ లావణ్యకు రూ. 5 లక్షలు కాగా, తనకు రూ. 3 లక్షలు అని వీఆర్వో అనంతయ్య రైతును డిమాండ్ చేశాడు. దీంతో చెన్నయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన తాసిల్దార్ అందులో రూ.4 లక్షలు అడ్వాన్సుగా తీసుకొనేందుకు వీఆర్వో అనంతయ్యను పురమాయించారు. చెన్నయ్య కుమారుడు భాస్కర్ అనంతయ్యకు కొందుర్గు తాసిల్దార్ కార్యాలయంలో రూ. 4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేశంపేట మండలంలో వీఆర్వోగా విధులు నిర్వహించిన అనంతయ్య గతనెల 13న బదిలీపై కొందుర్గు మండలానికి వచ్చాడు. 


పోమాల్‌పల్లిలో రెవెన్యూ సదస్సులో ఉన్న తాసిల్దార్ లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే  హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఆమె ఖరీదైన ఇంటిపై దాడి చేసిన అధికారులకు రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. లావణ్యను రెండేళ్ల కిందట ప్రభుత్వం ఉత్తమ అధికారిణిగా గుర్తించడం ఇందులో కొస‌మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: