ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిరోజే సవాళ్ల పర్వం మొదలైంది. రైతులకు రుణాల అంశంపై చర్చ జరుగుతున్నవేళ.. ఏపీ సీఎం జగన్.. విపక్షంపై విరుచుకుపడ్డారు. రైతులకు సున్నాకు వడ్డీ పథకం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఉందని టీడీపీ నేతలు మాట్లాడటంపై జగన్ మండిపడ్డారు.

గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరుకు రైతులకు సున్నా వడ్డీ కింద ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాస్తవాలు నిగ్గు తేల్చడానికి రికార్డులు తెప్పిస్తా...రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా అంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. సమాధానం చెప్పమంటే చంద్రబాబు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు మాటలు సత్యదూరం అని సున్నా వడ్డీ పథకానికి ఎంత డబ్బులు కేటాయించారో సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా పథకం తీసుకువస్తే అభినందించాల్సింది పోయి..ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.ఒక సారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానం అనుసరిస్తుందని తన పాలనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను చేయని సవాల్ కు తనను సవాల్ చేయడం ఏంటని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: