టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ బీజేపీ గూటికి చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ రలోనే ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో కాషాయ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలోనే గురువారం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను డీఎస్ క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌త కొంత‌కాలంగా డీఎస్ టీఆర్ ఎస్ పార్టీతో అంటీముట్ట‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలోనే ఆయ‌న పార్టీ మారుతార‌నే ఊహాగానాలు వినిపించాయి. 


బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన డీఎస్ లాంటి నేతను పార్టీలో చేర్చుకోవ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో మ‌రింత బ‌ల‌ప‌డొచ్చ‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం గ‌ల‌ ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ ఒక‌ప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా కొన‌సాగారు. 200 4లో పీసీసీ అధ్య‌క్షుడిగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయ‌న కౄషి ఉంది. రెండుసార్లు ఉమ్మ‌డి రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన డీఎస్‌, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అత్యంత విధేయుడిగా ప‌నిచేశారు.  


2009 లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత సీఎం రేసులో కూడా ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన డీఎస్ తెలంగాణ  ఏర్పాటు త‌ర్వాత అనూహ్యంగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. నిజామాబాద్ స్థానం నుంచి వ‌రుస‌గా తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవ‌డానికి కాంగ్రెస్ పార్టీయే కార‌ణమ‌ని ,  ఆ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని చెబుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీనియ‌ర్ నేత కావ‌డంతో కేసీఆర్ కూడా ఆయ‌న‌కు మంచి గౌర‌వ‌మే ఇచ్చారు. ఎంతోమంది సీనియ‌ర్ల‌ను వ‌దిలేసి డీఎస్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. 


అయితే, డీఎస్ చిన్న కుమారుడు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డం, బీజేపీ నుంచి అప్ప‌టి నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు గ‌ట్టి పోటీదారుగా మార‌డంతో డీఎస్‌తో క‌విత‌కు కోల్డ్ వార్ మొద‌లైంది. ఈక్ర‌మంలోనే తాజాగా నిజామాబాద్ ఎంపీగా త‌న కుమారుడు అర‌వింద్ బీజేపీ నుంచి గెలుపొంద‌డం, క‌విత ఓట‌మిపాలు కావ‌డంతో అధిష్టానం ఆయ‌న‌పై సీరియ‌స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: