జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ విషయంలో తెలుగుదేశంపార్టీ నోరెత్తలేకపోతోంది. మామూలుగా అధికారపార్టీ ప్రవేశపెట్టే బడ్జెట్ పై ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.  బడ్జెట్ స్వరూపం, కేటాయింపులు ఎలాగున్నా సరే అధికారపార్టీని వ్యతిరేకించటమే ప్రతిపక్షాల పని అన్నట్లుగా ఉంటుంది.

 

కానీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పైన మాత్రం టిడిపి పెద్దగా నోరెత్తలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే జగన్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావటం. తన హయాంలో ప్రభుత్వ ఖజానా గుల్లైపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది.

 

కాబట్టి బడ్జెట్ పై ఏమన్నా నెగిటివ్ గా మాట్లాడితే అది తిరిగి తమకే బూమరాంగ్ అవుతుందని చంద్రబాబు అండ్ కో కు బాగా తెలుసు. ఇప్పటికే చంద్రబాబు ఐదేళ్ళ పాలనను అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అండ్ కో ఉతికి ఆరేస్తోంది. అదే సమయంలో పాదయాత్రలో కావచ్చు లేదా ఎన్నికల్లో కావచ్చు జగన్ ఇచ్చిన హామీలకు తగ్గట్లే బడ్జెట్లో నిధుల కేటాయింపులు కూడా ఉన్నాయి.

 

రైతాంగానికి, 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు, విద్యాశాఖకు, మహిళలకు, గ్రామీణాభివృద్ధికి, వైద్య రంగానికి, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుకు హోలు మొత్తం మీద నవరత్నాల పథకాల అమలుకు నిధుల కేటాయింపులు కూడా ఘనంగానే ఉండటంతో టిడిపి నేతలు నోరెత్తలేకపోతున్నారు. కాకపోతే ఏదో ఆరోపణలు, విమర్శలు చేయటం తమ హక్కు కాబట్టి నోరు చేసుకుంటామంటే అది వారి విజ్ఞతే.


మరింత సమాచారం తెలుసుకోండి: