శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ గా సినీ నటుడు, కమెడియన్ పృధ్వీని నియమించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నియామకంపై పృద్వీకి సమాచారమిచ్చారు కూడా. జగన్ పై తనకున్న అభిమానాన్ని పృథ్వీ ఎప్పుడూ పలు వేదికలపై ప్రదర్శించారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా పలుమార్లు జగన్ తో పాటు పాల్గొన్నారు. జగన్ కు వీరవిధేయుడిగా నిరూపించుకున్నారు.

 

తనవెంట ఉండేవారిని మరచిపోని జగన్ ఎన్నికల ఫలితాల ముందే పృథ్వీని రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించి గౌరవించారు. ఆ పదవిలో కూడా పృథ్వీ వైసీపీ తరపున తన గళం బానే వినిపించారు. చివరకు ఎన్నికల్లో మెగా బ్రదర్స్ ను కూడా ఎదుర్కొన్నారు. అనేక సార్లు పవన్,  నాగబాబుపై విరుచుకుపడ్డారు కూడా. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఆవశ్యకతపై తన వాణిని గట్టిగా వినిపించి అథిష్టానం, జగన్ దృష్టిలో పడ్డారు. జగన్ ప్రభుత్వం రానే వచ్చింది.

 

జగన్ సీఎం అయ్యాక తనను నమ్మిన వారికి పలు పదవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన కోసం ఎంతో కష్టపడిన పృథ్వీని ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే చైర్మన్ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుమలకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లి చానెల్ భక్తి కార్యక్రమాలను భక్తులకు అందించడంలో పృథ్వీ తలమునకలు కానున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: