త‌న‌దైన శైలిలో విదులు నిర్వ‌హిస్తూ వార్త‌ల్లో నిలిచే ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఆమ్ర‌పాలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కొలువులో చేరనున్నారు. కిషన్‌రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా ఆమ్రపాలిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేషీలో ముగ్గురు తెలంగాణ అధికారులు పని చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌లుగా ఉన్న ఆమ్రపాలిని ఓఎస్డీగా, శశికిరణాచారిని హైదరాబాద్‌లో అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, ఐపీఎస్‌ అధికారి ఉత్తర మండల డీసీపీ ఏకేఝాను ప్రైవేటు కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 


గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన బ్యాచ్‌మేట్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆమ్ర‌పాలి నియామ‌కానికి తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.


ఇదిలాఉంటే, కిష‌న్‌రెడ్డి ఆమెకు అవ‌కాశం క‌ల్పించ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. స‌హ‌జంగా మీడియాకు దూరంగా ఉంటూ త‌న ప‌నేదో తాను చేసుకుపోయే కిష‌న్‌రెడ్డి త‌న శైలికి భిన్నంగా ఉండే ఆమ్ర‌పాలికి అవ‌కాశం ఎందుకు క‌ల్పించార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రిగా త‌న ముద్ర‌ను చాటుకునే క్ర‌మంలో, చురుకుగా ప‌నిచేసే అధికారిని ఎంచుకోవ‌డంలో భాగంగా కిష‌న్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: