బీజేపీ ర‌థ‌సార‌థి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాన‌స పుత్రిక అయిన ప‌థ‌కం కోసం...త‌న‌వంతు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన ఓ మ‌హిళా ఎంపీ సోష‌ల్ మీడియాలో న‌వ్వుల పాల‌వుతున్నారు. ఆ పార్ల‌మెంటు స‌భ్యురాలు చేసిన ప‌ని మంచిదే అయిన‌ప్ప‌టికీ సంద‌ర్భం- ప‌రిస్థితులు పూర్తి భిన్నమైన‌వి కావ‌డంతో..ఆమెపై నెటిజ‌న్లు పంచులు వేస్తున్నారు. ఇలా కామెంట్ చేస్తున్న వారిలో..సాక్షాత్తు ముఖ్య‌మంత్రి హోదాలో ప‌నిచేసిన వ్య‌క్తి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.



మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ‘స్వచ్ఛ భారత్’ ప్రోగ్రాంను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో, పార్లమెంట్ ఆవరణలో శనివారం స్వచ్ఛ భారత్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు చీపుర్లు చేతపట్టుకుని ఊడ్చారు. అయితే నటి, మధుర ఎంపీ హేమామాలిని కూడా ఇందులో పాల్గొన్నారు. చీపురుకట్టలతో వీరు పార్లమెంటులో ఆవరణను శుభ్రపరిచే ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ డ్రైవ్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోనే అతి శుభ్రమైన ప్రాంతాల్లో పార్లమెంటు కాంప్లెక్స్ ఒకటని ఆయన అన్నారు. అందులోనూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో వారక్కడ ఏమి ఊడుస్తారు’ అంటూ పరిశుభ్రతా డ్రైవ్‌లో పాల్గొన్న వారిని ఒక ట్వీట్‌లో ఒమర్ ప్రశ్నించారు. 


పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించగా...కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని చీపుర్లు పట్టి ప్రాంగణంలో చెత్త ఊడ్చారు. అనంతరం సిబ్బందితో కలిసి చెత్తను ఏరిపారేశారు. వీరితో పాటు మరికొంత మంది బీజేపీ ఎంపీలు, సిబ్బంది కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ట్వీట్‌లో ఎంపీ హేమమాలినిని ఉద్దేశిస్తూ ‘మేడం…దయచేసి మీరు ఈసారి బయట ఫోటో సెషన్‌లో పాల్గొనేటప్పుడు చీపురుకట్ట ఎలా పట్టుకుని ఊడ్చాలో ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన మెలకువలతో మధురలో కూడా మెరుగైన శుభ్రత అనేది సాధ్యం కాదు’ అంటూ ఒమ‌ర్ అబ్దుల్లా ట్రోల్ చేశారు. కొంద‌రు నెటిజ‌న్లు సైతం, హేమామాలినిపై ఇదే రీతిలో స్పందించ‌డం గ‌మ‌నార్హం.  


మరింత సమాచారం తెలుసుకోండి: