తెలంగాణ  ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఇటీవ‌లి కాలంలో ఒంటికాలిపై లేస్తున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తాజాగా మ‌రోమారు అదే రీతిలో స్పందించారు. తెలంగాణ  ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారీ సంస్క‌ర‌ణ‌ల‌తో పుర‌పాల‌క చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ``అభివృద్ధి అంటే ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడమో లేక ఇంకేమైనా కొన్ని పనులు చేయడమో కాదు. అర్థవంతమైన పాలనా సంస్కరణలు తేవడం చాలా కీలకం. పంచాయతీరాజ్ చట్టమైనా.. కొత్త మున్సిపల్ చట్టమైనా.. రేపు రాబోయే కొత్త రెవెన్యూ చట్టమైనా.. మంచి సంస్కరణలతో పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. ఆగ‌స్టు 15 నుంచి అస‌లైన ప‌రిపాల‌న అంటే ఏంటో చూస్తారు``అని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.


తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఈ కామెంట్లపై కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి సెటైర్లు వేశారు. ఇటు ట్విట్ట‌ర్లో అటు ఫేస్‌బుక్‌లో ఆమె త‌న‌దైన శైలిలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ``కేసీఆర్ గారు చెప్పే బంగారు తెలంగాణ లో కొత్తగా ప్రవేశ పెట్టబోయే మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్నారు. అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో ఏది అక్రమమో... సక్రమమో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొంది. అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్న కెసిఆర్ గారి ప్రభుత్వం... ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ భవనం అని తెలిసినా... దానిని కూలుస్తామనడంలో ఆంతర్యం ఏమిటి? కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా? కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల నుంచి వినిపించే బాధలు జోక్ గా గా అనిపిస్తాయి. ప్రతిపక్షాలు చేసే నిరసనలు అంతకంటే జోక్ గా కనిపిస్తాయి. చివరకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కూడా జోకులా అనిపించడం విడ్డూరం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఏ రకంగా మంటగలుస్తోందో అర్థం అవుతుంది. అధికారంలో ఉన్నాను కాబట్టి ఏమి చేసినా చెల్లుతుందని కెసిఆర్ గారు భావించడం దురదృష్టకరం. ఇంతకాలం దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని ప్రకటించడాన్ని బట్టి ఇంతకాలం అసలు తెలంగాణాలో పాలన జరగలేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మూడేళ్లలో అద్భుతం జరగబోతోందని కేసీఆర్ గారు అంటున్నారు. మరోవైపు మూడేళ్ల తర్వాత తెలంగాణలో కూడా అద్భుతం జరగబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఎవరి మాట నిజమవుతుందో కాలమే సమాధానం చెబుతుంది.`` అంటూ టార్గెట్ చేశారు విజ‌య‌శాంతి.


గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న అంటే ఎలా ఉంటుందో చాటిచెప్పేందుకు చేసిన కామెంట్లపై విజ‌య‌శాంతి ఈ విధంగా పంచ్‌లు పేల్చ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాంగ్రెస్ నేత‌లు కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డంలో త‌లోదారి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే...విజ‌య‌శాంతి మాత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై సైతం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను విజ‌య‌శాంతి ఇంకో పోస్ట్‌లో త‌ప్పు ప‌ట్ట‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు.


``నరేంద్ర మోదీది ఓ గెలుపా?...ఏం అభివృద్ధి చేశారని మోదీ మళ్లీ గెలిచారు?...కేవలం దేశభక్తి పేరుతో సెంటిమెంట్ ను రగల్చి... దాన్నే ఎన్నికల అంశంగా వాడుకుని, మోదీ గెలిచారని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు సెలవిచ్చారు. అభివృద్ధితో పని లేదు...సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని గెలవొచ్చని కేసీఆర్ చెబుతున్నారు. మరి 2014లో కూడా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకునే కదా టీఆరెస్ గెలిచింది. ఆర్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చి, కేసీఆర్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్ గారికి తత్వం బోధ పడినట్లు లేదు. అభివృద్ధి చేసినంత మాత్రాన గెలవాలని గ్యారెంటీ లేదని కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ ను అంతరార్ధాన్ని విశ్లేషిస్తే...ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల విషయం మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఒక విషయాన్ని గుర్తించాలి. మరో మూడేళ్లలో ఒకే దేశం..ఒకే ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ ప్రతిపాదనకు కేసీఆర్ గారు కూడా మద్దతు పలికారు. మరి అలాంటప్పుడు అసెంబ్లీతో పాటూ లోక్ సభకు జరిగే ఎన్నికల్లో మళ్లీ నరేంద్రమోదీ సెంటిమెంట్ రెచ్చగొట్టి, దానిద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే టీఆరెస్ చేతులెత్తేస్తుందా అనే విషయాన్ని టీఆరెస్ అధిష్టానం స్పష్టం చేయాల్సి ఉంది.`` అంటూ కేసీఆర్ కామెంట్ల‌ను విజ‌య‌శాంతి త‌ప్పుప‌ట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: