సామాన్యుల‌కు డ్రైవింగ్ లైసెన్స్ క‌ష్టాలు తీర‌నున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫ‌లితంగా గ‌తంలో చుక్క‌లు చూపించిన అంశాలు ఇప్పుడు తీరే అవ‌కాశం ఉన్నాయి. గ‌తంలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డులంటే ల‌క్ష తొంబై త‌ప్పులుండేవి. మ‌న వివ‌రాలు ఒక‌టైతే...అందులో ఉండేవి మ‌రొక‌టి ఉండేవి. అయితే ఆ చిత్రాల‌కు ఇక చెక్ ప‌డ‌నుంది. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల‌ను ప్రింటింగ్‌కు పంపించేముందు.. దరఖాస్తుదారులకు వాటి ప్రతులను వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రింటింగ్ సమయంలో తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 


ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్టు రవాణాశాఖ జాయింట్ కమిషనర్, ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేశ్ తెలిపారు. శనివారం ట్రాన్స్‌పోర్టుభవన్‌లో రమేశ్ అధ్యక్షతన సమావేశమైన ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకొంది. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశామని.. రవాణాశాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటామని రమేశ్ చెప్పారు. పెండింగ్‌కార్డులను సోమవారం నుంచి పంపిణీచేస్తామన్నారు. 


ఇదిలాఉండ‌గా, కేంద్ర ప్ర‌భుత్వం సైతం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా వ‌చ్చే నెల నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) జారీచేయనున్నారు. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను ముద్రించనున్నారు. కార్డు వివరాల్ని వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే సెక్యూరిటీ ఫీచర్లతో ఈ సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో దీన్ని జారీ చేస్తారు. వాహన డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాల్ని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌పై పొందుపరుస్తారు. ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాల్ని కార్డుపై ముద్రిస్తారు.


దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 32వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు(నెలకు సుమారు 9.6 లక్షలు) జారీ లేదా రెన్యువల్ చేస్తున్నారు. అలాగే నిత్యం 43వేల వాహనాలు(నెలకు సుమారు 13 లక్షలు) కొత్తగా రిజిస్టర్ లేదంటే రీ-రిజిస్టర్ అవుతున్నాయి. వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టే లైసెన్సులు, ఆర్సీలను రవాణాశాఖ జారీచేయనున్నది. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. ఈ కొత్త కార్డుల ధర 15 నుంచి 20 రూపాయలకు మించకపోవచ్చని ఆయన వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: