ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థికసాయాన్ని అందించడం లేదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. దొరికిందే అవకాశమని తెలుగుదేశం అగ్రనేతలు చంద్రబాబుతో సహా లోకేశ్ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ తీరు వల్లే ప్రపంచ బ్యాంక్ వెనక్కివెళ్లిందని ట్విట్టల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.


అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది... ప్రపంచ బ్యాంకు వెనుకడుగుకు అసలు కారణం ఏంటో ఆ ప్రపంచ బ్యాంకే చెప్పేసింది. కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకున్నట్లు ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.


రాజధాని ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విషయంలో తమ సహకారం వుంటుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అదికూడా కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.


సో.. దీనివల్ల తేలిందేమంటే.. ప్రపంచ బ్యాంకు నిర్ణయానికీ జగన్ సర్కారు పనితీరుకూ సంబంధమే లేదు. మరి అసలు విషయం తెలిసిన తర్వాత తెలుగుదేశం నేతలు ఏం చేస్తారు.. జగన్ ను తిట్టినట్టే.. అటు మోడీపైన కూడా విమర్శల వర్షం కురిపిస్తారా..?


లేకపోతే.. తేలు కుట్టిన దొంగల్లా సైలంట్ గా ఉండిపోతారా.. సైలంట్ గానే ఉండిపోతారు. ఈ పరిస్థితుల్లో మోడీని విమర్శలు చేసే సాహనం తెలుగుదేశం నేతలు చేసే అవకాశమే కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: