ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను గొడవ విషయంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఈ సమావేశాలు ముగిసేవరకు తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న ఉపసభాపతి కోన రఘుపతి దీనిని ఆమోదించారు.


టీడీపీ సభ్యులు సభను వీడకపోవడంతో మార్షల్స్‌ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లిపోయారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి సస్పెండ్ కావడంతో బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ళ రాజకీయ జీవితం లో మొదటి సారి సభ లో సస్పెండ్ అయ్యానన్నారు.


6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఇప్పటి వరకు ఏ సభలోనూ సస్పెండ్ చెయ్యలేదని.. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ పక్షం నన్ను సస్పెండ్ చెయ్యాలి అనుకోలేదని బుచ్చయ్య అన్నారు. తన లాంటి వాడిని సస్పెండ్ చెయ్యడం తోనే ప్రభుత్వ వైఖరి అర్ధం అవుతుందని ఆయన విమర్శించారు.


నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర, ఆరుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యానని.. తండ్రి రాజశేఖర్ రెడ్డి చేయించలేని సస్పెన్షన్ కొడుకు జగన్ చేయించారని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: