కర్నాటకలో బిజెపి నేత యడియూరప్ప శుక్రవారం సాయంత్రం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 14 నెలల జెడిఎస్‌ కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ఓడిన తరువాత, యడ్యూరప్ప సిఎంగా ప్రమాణం చేశారు.


యడ్యూరప్ప ఈ నెల 31వ తేదీలోగా సభలో బలం నిరూపించుకోవల్సి ఉంటుంది. అయితే ఆయన ఇంకా ముందుగానే అంటే సోమవారం విశ్వాస పరీక్షకు దిగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సభలో బిజెపికి సొంతంగా 106 మంది సభ్యుల బలం ఉంది. ఆధిక్యత నిరూపించుకోవడానికి ఆరుగురు సభ్యుల అవసరం ఉంది. అవసరం అయిన బలం సంతరించుకోగలనని యడ్యూరప్ప విశ్వాసంతో ఉన్నారు. 

పేరు మార్పు వెనుక సంఖ్యాశాస్త్రం

మొన్నటి వరకు యడ్యూరప్ప(Yeddyurappa)గా పిలిపించుకున్న ఈ కొత్త సీఎం ఇప్పుడు యడియూరప్ప(Yediyurappa) అయ్యారు. ఈ పేరుతోనే, శుక్రవారం కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సంఖ్యాశాస్త్రాన్ని బలంగా నమ్మే యడ్యూరప్ప గవర్నర్‌కు ప్రభుత్వ స్థాపనకు అందించిన లేఖలో ఆంగ్లంలోని యడియూరప్ప పేరునే తెలియచేశారు.


గవర్నర్‌కు పంపించిన లేఖ మీడియాకు కూడా చేరడంతో పేరులోని అక్షర మార్పిడి క్రమం వెలుగులోకి వచ్చింది. గవర్నర్‌కు అందించిన లేఖ ఆ తరువాత తన ప్రమాణ కార్యక్రమానికి హడావుడిగా అచ్చువేయించిన ఇన్విటేషన్లల లో కూడా యడియూరప్ప పేరు చోటుచేసుకుంది. యడ్యూరప్ప పేరిట తనకు సిఎంగా కలిసిరావడం లేదని, ఇందులో అశుభాలు ఉన్నాయనే నమ్మకంతో ఆయన పేరు మార్చుకున్నట్లు వెల్లడైంది.


ఒకటి కాదు మూడుసార్లు తనను తన పాతపేరు సరిగ్గా అధికారంలో ఉండనివ్వడం లేదని, పేరు మార్చుకుని అధికారం సుస్థిరం చేసుకుందామనే సంకల్పంతోనే ఆయన పేరు మార్పిడికి దిగినట్లు తెలిసింది. ఈ పేరు మార్పు వెనుక ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక న్యూమరాలజిస్టు ఉన్నట్టు తెలిసింది. ఇక ఆయన పూర్వీకుల స్థలం శివమోగా జిల్లాలో ఉత్సవాలు మిన్నంటాయి.

మాండ్యా జిల్లాలో ఆయన పుట్టిన బుక్కనకెరేలో యెడియూరప్ప అధికారానికి ఎటువంటి విఘ్నాలు కలగరాదనే తాపత్రయంతో గుడులలో పూజాదికాలు, శాంతి హోమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల పండుగ వాతావరణం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: