ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన ఓ ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా వ్యవహరించారని అప్పట్లో పత్రికలు ఆయన్ను కీర్తించాయి. చంద్రబాబు సాధారణంగా చేసే పని కంటే ఎక్కువగా హడావిడి చేస్తారన్న పేరు కూడా వచ్చింది.


ప్రత్యేకించి ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హడావిడి మరింత ఎక్కువైంది. ప్రత్యేక విమానాల్లో విదేశాలు చుట్టిరావడం.. అక్కడి కంపెనీలతో చర్చించినట్టు.. వారు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నట్టు ఎల్లో మీడియా ఊదరగొట్టడం సర్వసాధారణంగా మారింది.


అయితే జగన్ సీఎం అయ్యాక ఈ హడావిడి ఏమీ కనిపించడం లేదు. కానీ జగన్ రెండు నెలల్లో కామ్ గానే చాలా సాధించాడని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకు వారు కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు.


కొత్త ప్రభుత్వం కోరితే మౌలిక వ‌స‌తుల కోసం వేల కోట్ల రుణ మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖ‌త వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య రంగానికి 328 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయం అందించే విష‌యంలో ఒప్పందాల‌నూ సంత‌కాలు కూడా ప్రపంచ బ్యాంకు చేసిందని చెబుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన నెల రోజుల్లోపే ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, సింగ‌పూర్, చైనా ప్ర‌తినిధులు రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు క్యూ క‌డుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


చంద్రబాబులా వైఎస్ జ‌గ‌న్ ఏ దేశానికీ వెళ్లలేదు. అయినా స‌రే అమెరికా రాయ‌బారి స్వయంగా వ‌చ్చి ఏపీ మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చించి వెళ్లింది. రాజ‌ధాని ప్రాజెక్టు నుండి త‌ప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విష‌యంలో స‌హ‌క‌రిస్తామ‌ని ప్రపంచ బ్యాంకు స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఆరోగ్యం, వ్యవ‌సాయం,ఇంధ‌నం, విప‌త్తు నిర్వహ‌ణా రంగాల్లో భారీగా ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలియ‌జేసింది. చంద్రబాబులా మాట‌ల్లో కాదు చేత‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ అభివృద్ధిని చేసి చూపుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: