వైసీపీలో కీల‌క నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి వ‌రుస‌గా రెండో సారి కూడా ఘ‌న విజ‌యం సాధించిన రోజా రెడ్డికి .. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ కీల‌క‌మైన ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాల‌కల్ప‌న సంస్థ చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌విని అప్ప‌గించారు. వాస్త‌వానికి కేబినెట్‌లో చోటు కోసం ఆమె ప్ర‌య‌త్నించారు. కానీ, సామాజిక ఇంజ‌నీరింగ్ పాటించిన నేప‌థ్యంలో అనేక మంది కీల‌క నాయ‌కుల‌కు జ‌గ‌న్ న్యాయం చేయలేక పోయారు. ఈ క్ర‌మంలో ఇలాంటి వారికి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను అప్ప‌గించారు. అందులోనూ కీల‌క‌మైన ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్‌ప‌ద‌విని రోజాకు అప్ప‌గించారు. నిజానికి ఇది అత్యంత కీల‌క‌మైన పోస్టుగానే చెప్పాలి. విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రంలో ఆర్థిక గ‌మ‌నం మంద‌గించింది. ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మ‌ల విష‌యంలో రాష్ట్రం ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. 


ఉపాధి క‌ల్పన అనేది ప‌రిశ్ర‌మ‌ల ద్వారానే సాగాల్సిన కీల‌కమైన ప్ర‌క్రియ‌. దీనికి సంబంధించి కీలక నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన బాధ్య‌త‌, ప్ర‌భుత్వ ప్రాధాన్యాల‌కు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం కూడా ఏపీఐఐసీపైనే ఉంటుంది. పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల విష‌యంలో రాష్ట్రానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే వెసులుబాటు విష‌యంలోనూ ఏపీఐఐసీ కీల‌క పాత్ర వ‌హించ‌నుంది. ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటు, ప్ర‌త్యేక ఆర్థిక మండ‌ళ్ల ఏర్పాటు, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, దేశ‌, విదేశీ కంపెనీల‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం అనేవి కీల‌కం. అదేస‌మ‌యంలో స్తానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న అనేది ప్ర‌ధాన రంగంగా ఈ ఏపీఐఐసీ ముందుకు సాగుతోంది.  గ‌త ప్ర‌భుత్వం కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. ఈ క్ర‌మంలోనే అనేక ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏపీకి తెప్పించేలా చ‌ర్య‌లు తీసుకుంది. పెట్టుబ‌డుల కోసం ప్ర‌తి ఏటా విశాఖ‌లో సీఐఐ ఆధ్వ‌ర్యంలో ఏపీఐఐసీ స‌ద‌స్సులు నిర్వ‌హించింది. 


ముఖ్యంగా త‌యారీ రంగాన్ని ప్రోత్స‌హించింది. దీనివ‌ల్ల మ‌హిళ‌ల‌కు, సెల్ఫ్‌హెల్ప్ బృందాల‌కు ఉపాధి క‌ల్పించ‌డంలోను, కియా వంటి ప‌రిశ్ర‌మ‌ల ను తీసుకురావ‌డంలోను ఏపీఐఐసీ గ‌ణ‌నీయ‌మైన పాత్ర పోషించింది. ఇక‌, ఇప్పుడు ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్‌గా కీల‌క ప‌ద‌విని చేప‌ట్టిన రోజా ముందు కూడా ఇలాంటి బాధ్య‌త‌లే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా మ‌రింతగా ఆమెకు బాధ్య‌త‌లు పెరిగాయి. తాజాగా అసెంబ్లీ ఆమోదించిన స్థానికుల‌కు 75 శాతం ఉద్యోగాల క‌ల్ప న అనేది ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌ధాన అవ‌రోధంగా మారింది. అదేస‌మ‌యంలో నీటి స‌దుపాయాలు, విద్యుత్ వంటివి ఏర్పాటు, భూ సేక‌ర‌ణ వంటివి కూ డా రోజాకు స‌వాళ్లుగా మార‌నున్నాయి. ఏపీఐఐసీ ప్ర‌ధాన కార్యాల‌యం విజ‌య‌వాడలోనే ఉండ‌డంతో ఆమె రోజూ కార్యాల‌యంలో అందుబా టు లో ఉండాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. 


ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 320 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు ఏపీలో ఉన్నాయి. అయితే, జ‌గ‌న్ ల‌క్ష్యం ప్ర‌కారం వీటిని వెయ్యికి చేర్చాలి. అదేస‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్టేవారిని వెతికి ప‌ట్టుకోవాలి. వీరికి స‌రైన ప్రోత్సాహ‌కాలు అందించాలి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే రోజా తెలివి తేట‌ల‌కు, ప‌దునైన చ‌ర్చ‌ల‌కు, మేధావి త‌నానికి కూడా పెద్ద ప‌రీక్షే. ఆమె క‌నుక భారీ సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకు వ‌చ్చిఏపీలో ఏర్పాటు చేయించ‌గ‌లిగి, గ‌త ప్ర‌భుత్వ రికార్డును తిర‌గ‌రాస్తే.. ఆమెకు భ‌విష్య‌త్తులో రాజ‌కీయంగా తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: