ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు యాక్టివ్ ఎంపీ. అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీకి ఏపీలో కీల‌క నాయ‌కుడు. 2014లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన సౌమ్యుడు. వివాద ర‌హితుడు. మేధావి. విద్యావంతుడు. ఆయ‌నే బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు. బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఇద్ద‌రు ఎంపీల్లో ఈయ‌న ఒక‌రు. అయితే, ఇప్పుడు ఆయ‌న హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఆయ‌న ముభావంగా ఉంటున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయ వీఆర్ ఎస్ తీసుకోబోతున్నార‌ని అంటున్నారు బీజేపీలోకి ఓ వ‌ర్గం నాయ‌కులు. దీంతో ఒక్క‌సారిగా హ‌రిబాబు రాజ‌కీయాల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. 


ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు శిష్యుడుగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన హ‌రిబాబు.. అనంత‌ర కాలంలో అనేక ప‌ద‌వుల‌ను స్వీక‌రించారు. ఏకంగా ఏడేళ్ల పాటు పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2014లో విశాఖ ఎంపీ గా కూడా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఓ విధంగా అప్పట్లో ఏపీ బీజేపీ రాజకీయాలు మొత్తం హరిబాబు చుట్టూ తిరిగేవి . ఓ దశలో కంభంపాటి హరిబాబు కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం కూడా జ‌రిగింది. 


అయితే వెంకయ్యనాయుడు రాజ్యాంగ బద్దమైన పదవిలోకి వెళ్ళిపోవడంతో కంభంపాటి హరిబాబు ప్రభ ఒక్కసారిగా మసకబారింది. ఆయన బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. అదేస‌మ‌యంలో ఒక‌ప‌క్క చంద్ర‌బాబు ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీపైనా, మోడీపైనా నిప్పులు చెరిగినా.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించినా.. కూడా హ‌రిబాబు వాటిపై నేరుగా కౌంట‌ర్లు ఇవ్వ‌లేక పోయారు. దీంతో ఆయ‌న‌పై అధిష్టానం కూడా పెద‌వి విరిచింది. దీంతో ఆయ‌నే రాష్ట్ర బీజేపీ ప‌గ్గాల నుంచి స్వ‌యంగా త‌ప్పుకొనేలా పైనుంచి చ‌క్రం తిప్పారు. దీంతో హ‌రిబాబు బీజేపీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకొన్నారు. 


మ‌రొక‌పక్క‌, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు.  మొత్తానికి కంభంపాటి హరిబాబు రాజకీయ జీవితం భారీ అంచనాలతో మొదలై ఎంపీ పదవీకాలంతో పాటే అలా ఆగిపో యింది.అయితే, ఎంత‌లేద‌న్నా.. సీనియ‌ర్ నాయ‌కుడు, ఉర‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌కు అత్యంత ప్రియ‌మైన వాడు.. కావ‌డంతో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కితీరుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో తిరుగులేని శ‌క్తితో బీజేపీ ఉన్న నేప‌థ్యంలో ప‌ద‌వి ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగావినిపిస్తున్నాయి. 


అయితే, ఇప్పుడు ఏపీలో ఎదిగేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న బీజేపీ.. ఎవ‌రైతే పార్టీకి క‌లిసివ‌స్తారో.. వారినే త‌మ‌కు అనుకూలంగా ప‌ద‌వులు ఇవ్వ‌డం, ప్రోత్స‌హించ‌డం అనేవి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.  ఈ నేప‌థ్యంలో బీజేపీలోని మ‌హిళా నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రికి రాజ్య‌స‌భ సీటును ఇవ్వాల‌నినిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే. ఏపీకి ద‌క్కే ఒక్క రాజ్య‌స‌భ సీటు కూడా హ‌రిబాబుకు ద‌క్క‌కుండా పోవ‌డం ఖాయం. ఈ విష‌యం తెలుసుకున్న హ‌రిబాబు ఇక‌, పూర్తిగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డమే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: