సమీక్షలు ప్రజా ప్రయోజనాల కోసమే కావాలి వై.ఎస్‌. జగన్‌ ప్రభుత్వం జూలై 1న తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం కేంద్ర ప్రభుత్వంలో, పారిశ్రామిక, వాణిజ్యవర్గాలలో, బహుళ జాతి సంస్థలలో వివాదాస్పదమవుతూ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. దేశంలో బహుళ జాతి సంస్థలకూ, బడా పారిశ్రామిక వర్గాలకూ ప్రాతినిధ్యం వహించే వాణిజ్య మీడియా ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విరివిగా వార్తా కథనాలు ఇస్తున్నారు.


గత తెలుగుదేశం పార్టీ పాలనా కాలంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కోసం, ముఖ్యంగా 7,700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యపు సౌర, పవన విద్యుదుత్పత్తి కోసం, దాని కొనుగోలు కోసం ప్రైవేటు వ్యాపార సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందనీ, ఆ ఒప్పందాలన్నిటినీ సమీక్షించాలనీ, వారికి చెల్లిస్తున్న ధరలనూ, ఒప్పందం కుదిరిన నాటి మార్కెట్‌ ధరలనూ, ప్రస్తుత ధరలనూ మదింపు వేసి, ఆ ఒప్పందాలు సక్రమంగా జరిగి ఉంటే ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం ఉండేదో తేల్చి, ఆయా సంస్థలతో కొత్త ఒప్పందాల కోసం చర్చలు జరిపి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ సీఎం జగన్‌ ఒక ఉన్నతస్థాయి కమిటీని జూలై 1 న నియమించారు.


ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపనీ అటువంటి సమీక్ష కోసం రమ్మని, ఈలోగా విద్యుత్‌ ధరలు తగ్గించమని ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపార సంస్థలకు జూలై 12న లేఖ రాసింది. దీని పై ఇప్పటికే డిబేట్‌ నడుస్తోంది. ప్రముఖ ఆర్ధిక నిపుణుడు, ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక మాజీ జర్నలిస్టు ఎన్‌.వేణుగోపాల్‌ దీనిపై ఇలా అంటున్నారు...


'' ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైనప్పటి నుంచీ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలన్నీ అక్రమాల కుప్పలే. ఆ తేనెతుట్టెను కదిలిస్తే గత రెండున్నర దశాబ్దాలలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులూ, విద్యుత్‌ శాఖ మంత్రులూ, సంబంధిత శాఖల అధికారులూ, బహుళ జాతి సంస్థలూ, వందల, వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో భాగస్వాములుగా బైటపడతారు. అందుకే, గతంలో అక్రమంగా, అవినీతితో జరిగిన ఒప్పందాల రద్దు దాకా కూడ కాదు, కేవలం సమీక్ష అనే ప్రతిపాదన రాగానే గగ్గోలు ప్రారంభమయింది.


ఇది మదుపుదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, అంటే రాష్ట్ర ప్రగతిని మందగింపజేస్తుందని, ఇటువంటి చర్యలు చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సమీక్షలు సాగితే, ఆ వ్యాపార సంస్థలు తెచ్చుకున్న రుణాలకు ముప్పు వాటిల్లుతుందని, తక్షణమే రు. 10,600 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారిపోతాయని, మొత్తంగా ఇది రు. 21,000 కోట్ల రుణాలు ఇబ్బందిలో పడడానికి దారితీస్తుందని వ్యాపార సలహా సంస్థలు గగ్గోలు ప్రారంభించాయి. ఇక ఆ ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లాయి. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం మీద స్టే విధించింది. వై ఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడ ఆ వ్యాపార సంస్థలను బెదిరించి వారి నుంచి ముడుపులు సంపాదించడానికే ఈ సమీక్షా కార్యక్రమాన్ని ప్రతిపాదించింది గాని, నిజంగా సమీక్షించాలని ఏమీ కాదు.

ప్రజాధనం వ్యర్థమవుతున్నదనే, కాపాడాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికేమీ లేదు. ప్రభుత్వాలూ వ్యాపార సంస్థలూ కలిసి ఎన్ని అక్రమాలతో ఎన్నెన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తింటున్నాయో, ఆ దోపిడీని ఆపడం కూడ కాదు, కనీసం సమీక్షిస్తామని అంటేనే ఎంత గగ్గోలు జరుగుతుందో ఈ పరిణామాలు చూపుతున్నాయి. నిజంగా ప్రజల పక్షాన ఇటువంటి సమీక్షలూ, అక్రమాల రద్దులూ జరిగితే ఎంత విస్ఫోటనం జరగాలి!'' అని ముగించారు ఆ ఆర్ధిక విశ్లేషకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: