అరుదైన వీడియోలు తీసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేయాలనే కుతూహలం ఆ యువకుడిని చిక్కుల్లో పడేసింది. వీడియో తీసేందుకు శేషాచలం అడవుల్లోకి వెళ్లిన ఆ యువకుడు దారితప్పాడు. రాత్రంతా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. చివరకు పోలీసుల సాయంతో క్షేమంగా బయటపడ్డాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఈ ఘటన జరిగింది. మంగళపల్లెకు చెందిన వి మురళీ కృష్ణ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.


తరచూ వెరైటీ వీడియోలు తీసి టిక్ టాక్ యాప్ లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఆదివారం మరో వీడియో తీసేందుకు ఉదయం 10 గంటల సమయంలో శ్రీవారిమెట్టు మార్గంలో శేషాచలం అడవికి వెళ్లాడు. అక్కడ ఓ గుట్ట పై జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న వీడియోను చిత్రీకరించాడు. తిరిగివచ్చేక్రమంలో శ్రీవారిమెట్టు రోడ్డు మార్గానికి కాస్త సమీపంలోనే దారితప్పాడు. అప్పటికే సమయం రాత్రి తొమ్మిది గంటలైంది.ఐతే దారి తప్పటంతో ఎక్కువ సేపు అక్కడే తిరగటం వల్ల అక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక అపస్మారక స్థితికి చేరువయ్యాడు.


ఏ దిక్కూ తోచక పోవటం తో చివరికి తోటి విద్యార్థులు అధ్యాపకుడికి ఫోన్ లో తన పరిస్థితిని వివరించి వాట్సప్ లో అతను ఉన్న లోకేషన్ షేర్ చేశాడు. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేయడంతో చంద్రగిరి పోలీసులు ఎస్ టిఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రి 10 గంటల నుంచి శేషాచలం అడవుల్లో గాలించి అతని గుర్తించగలిగారు. ప్రస్తుతం అతనిని చికిత్స కోసం రుయా హాస్పిటల్ కి తరలించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: