కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ మృతి దేశ‌వ్యాప్తంగా క‌లక‌లం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ‌, పారిశ్రామిక ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో ఈ ఎపిసోడ్ రాజ‌కీయ రంగు ప‌లుముకుంటోంది. సిద్ధార్థమృతిపై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, కర్ణాట‌క మాజీ సీఎం సిద్ధరామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారం, రాజ‌కీయం కోణంలో ప్ర‌స్తావించారు.


సిద్ధార్థ మృతి త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌ని, ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని మ‌మ‌తాబెన‌ర్జీ అన్నారు.సిద్ధార్థ కుటుంస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు మ‌మ‌తా తెలిపారు. వివిధ ఏజెన్సీ వ‌త్తిడి వ‌ల్లే సిద్ధార్థ‌ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అత‌ను రాసిన లేఖ ద్వారా తెలుస్తోంద‌ని దీదీ ట్విట్ట‌ర్‌లో అన్నారు. దేశంలో వివిధ కంపెనీల అధినేత‌లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నార‌న్నారు. కొంద‌రు వ్యాపార‌వేత్త‌లు దేశం విడిచి వెళ్లార‌ని, కొంద‌రు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. దేశ ఆర్థిక ప్ర‌గ‌తి కేవ‌లం 5.8 శాతంగా ఉంద‌ని, నిరుద్యోగ శాతం కూడా పెరిగింద‌ని మ‌మ‌తా ఆరోపించారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అయిన ఆర్ఢినెన్స్ ఫ్యాక్ట‌రీ, బీఎస్ఎన్ఎల్‌, ఎయిర్ ఇండియా, రైల్వే లాంటి 45 సంస్థ‌ల‌ను అమ్మేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని దీదీ విమ‌ర్శించారు. సాధార‌ణ ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నార‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌ను నిర్వీర్యం చేస్తే అప్పుడు ఆర్థిక ప్ర‌గ‌తి ఉండ‌ద‌న్నారు. నిరుద్యోగం కూడా పెరుగుతుంద‌న్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా శాంతి యుతంగా ప‌నిచేయాల‌ని, దాని ద్వారా విశ్వాసం పెరుగుతుంద‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తో వివిధ ఏజెన్సీల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌న్నారు. 


క‌ర్నాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య సైతం సిద్ధార్థ మృతిప‌ట్ల సంతాపం తెలిపారు. వ్యాపార‌వేత్త‌ల చావుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని సిద్ధ‌రామ‌య్య అన్నారు. కొంద‌రు కార్ప‌రేట్ల‌ను సెలెక్ట్ చేసుకుని వేధిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. సిద్ధార్థ మృతి క‌లిచివేస్తున్న‌ద‌ని, అంతు చిక్క‌ని మ‌ర‌ణంగా మారింద‌ని, కాఫీ డే ఓన‌ర్ మృతికి దారితీసిన కార‌ణాల‌ను నిశితంగా పరిశీలించి శోధించాల‌న్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఎస్ఎం కృష్ణ ప‌క్షాన తాను సంఘీభావం తెలుపుతున్న‌ట్లు సిద్ధ‌రామ‌య్య‌ చెప్పారు. సిద్ధార్థ రాసిన లేఖ ట్యాక్స్ టెర్ర‌రిజాన్ని బ‌హిర్గతం చేస్తుంద‌ని, రాజ‌కీయ క‌క్ష్య‌తోనే ఇలాంటి దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మ‌నం ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నామ‌న్న విష‌యాన్ని స‌మీక్షించాల‌న్నారు. కేంద్రం కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను మాత్ర‌మే ఆదుకుంటున్న‌ద‌ని సిద్ధ‌రామ‌య్య తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: