తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవు బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. స్నేహితుడి బర్త్‌డే వేడుకలలో పాల్లొనేందుకు వెళ్లి ఆ ఇద్దరూ బలైపోయారు. వివరాల్లలోకెళ్తే... అల్లవరం మండలంలోని ఓడలరేవు టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంతం ఆహ్లాదానికి పెట్టింది పేరు. గోదావరి నదుల పాయలు సముద్రంలో కలిసే ప్రాంతం ఇది.
సానబోయిన హరిబాబు (19) ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. అదే విధంగా పేరూరు వై జంక్షన్‌కు చెందిన గంటి శివ (19) కూడా వారి స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లి వారిద్దరూ గల్లంతయ్యారు. వారి స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించేందుకు విశ్వయత్నాలు చేసారు.

హిరిబాబు, శివ ఇద్దరూ ఎక్కువలోతుకు  వెళ్లడంతో తిరిగి వారు బయటకు రాలేకపోయారు. కొద్ది సేపటికి హరిబాబు మృతదేహం దరికి కొట్టుకురావటంతో స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగొచ్చిన కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాభరితం. మరొక విద్యార్థి గంటి శివ మృతదేహం ఆచూకీ లభించకపోడంతో స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారంతా అమలాపురంలోని ఎస్‌కెబీఆర్‌ కళశాలలో డిగ్రీ చదువుతున్నట్టు పోలీసులు తెలియజేశారు. 

ఓడలరేవు బీచ్‌లో తరచూ అనేక మంది విద్యార్థులు , యువకులు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు  ఆరోపిస్తున్నారు. సముద్ర స్నానానికి సరిహద్దులు నిర్ణయించి అంతకు మించి వెళ్లేందుకు వీల్లేకుండా తగిన ఏర్పాటు చేయటం ద్వారా యువకులు, విద్యార్థులు మృత్యువాత పడకుండా కాపాడవచ్చని సూచిస్తున్నారు. 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గత ఐదేళ్ల క్రితం ఇదే విధంగా అనేక మంది మృత్యువాత పడుతుండటంతో గోదావరి నీటి లోతును బట్టి సరిహద్దులు ఏర్పాటు చేశారని అదే విధంగా ఓడలరేవు వద్ద కూడా యువకులను నియంత్రిండం ద్వారాగాని, సరిహద్దులు నిర్ణయించడం ద్వారాగాని గల్లంతు సంఘటనలు, మరణాలకు అడ్డుకట్టవేయవచ్చని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: