యాగాలు, హోమాలు చేయడం  కేసీయార్ కి అలవాటు, మరి వాటిని జగన్ కి కూడా నేర్పిస్తున్నారా..కేసీయార్ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. విద్యార్ధి దశ నుంచి కూడా ఆయన రాజకీయం రాటు తేలింది. ఇక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా  కేసీయార్ రాజకీయ ప్రస్తానం ఎన్నతగినది. ఉద్యమ నేతగా కూడా కేసీయార్ తనదైన శైలిలో తెలంగాణా సాధించారు. కేసీయార్ అంటే ప్రత్యర్ధులకు ఎపుడూ భయమే. బక్క పలచగా ఉన్నా ముట్టుకుంటే షాక్ ఇచ్చే కరెంట్ తీగ మాదిరిగా ఉంటుంది కేసీయార్ వ్యవహారం. 


ఆయనతో పోలిస్తే జగన్ రాజకీయంగా జూనియర్. అయితే జగన్ లో పట్టుదల, దేన్ని అయినా సాధించే గుణం ప్రత్యేకతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, కొన్ని విలువలు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం జగన్ స్టైల్. మరి వర్తమాన రాజకీయలకు జగన్ ఎంతవరకూ కరెక్ట్. ఓ వైపు తేడా పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ మడీ తడీ విడిచేసి మరీ వీరంగం వేస్తుంటే ఏపీలో అడ్డుకోవడానికి జగన్ ఏం చేయాలి.


ఇదిలా ఉండగా కేసీయార్ జగన్ భేటీ నిన్న జరిగింది. అందులో చాలా విషయాలే ఇద్దరు నాయకులూ చర్చించారు. ఇక ఇద్దరినీ కలవరపెట్టే ఉమ్మడి విషయం ఒకటి ఉంది. అదే బీజేపీ. కేంద్రంలో రెండవమారు అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ స్పీడే మారిపోయింది. ఆ పార్టీ జోరు అలా ఇలా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా బలం లేకపోయినా అధికారంలోకి మేమే వస్తామంటూ గప్పాలు కొడుతోంది. టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులను కలుపులుని హుషార్ చేస్తోంది. ఇపుడు ఇదే కేసీయార్, జగన్ ల మధ్యన చర్చగా నడిచిందట..


ఏపీలో బీజేపీ బలపడకూడంటే వచ్చిన వారిని వచ్చినట్లుగా వైసీపీలోకి చేర్చుకోవాలని కేసీయార్ జగన్ కి సలహా ఇచ్చారట. టీడీపీ నేతలకు గేలం వేయడం ద్వారా బీజేపీకి, టీడీపీకి కూడా ఒకే సారి దెబ్బ కొట్టాలని కూడా కేసీయార్ చెప్పారట. ఏపీలో వైసీపీ ఒక్కటే బలమైన పార్టీగా కనిపించాలని, దాని కోసం జగన్ తన సిధ్ధాంతాలను పక్కన పెట్టి మరీ దూకుడుగా వెళ్ళాలని కూడా కేసీయార్ సూచనలు చేశారట. ఏపీలో ఏమీ కానీ బీజేపీలోకి నేతలు వెళ్ళడం అంటూ జరిగితే అది రేపటికైనా  ప్రమాదమేనని కూడా కేసీయార్ జగన్ కి హితబోధ చేశారట.


చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న కేసీయార్ బీజేపీని ఏపీలోకి రానీయకుండా సర్పయాగమే చేయాలని చెప్పారట. తాను తెలంగాణాలో కాంగ్రెస్ నాయకులను మొత్తం చేర్చుకున్న తీరుని కూడా ఆయన జగన్ కి వివరిస్తూ ఇలాగే ఏపీలో చేయమని రాజకీయ ఉపదేశం చేశారట. టీడీపీ, బీజేపీ రెండూ వేరుగా ఉన్న రాజకీయాల్లో నమ్మలేమని, అందువల్ల ఖాళీగా  ఉన్న ఏ ఒక్క నాయకుడినీ వదలకుండా వైసీపీలోకి తీసుకువస్తేనే తప్ప బీజేపీ దూకుడుకి అడ్డుకట్ట వేయలేమని కేసీయర్ హిత బోధ చేశారట. మొత్తానికి ఏపీలో బీజేపీకి డోర్లు క్లోజ్ చేసేలా జగన్ ఇకపై తనదైన రాజకీయం చూపిస్తారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: