ట్రిపుల్ ఐటి వంటి ఆదునిక, సాంకేతిక విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపిల్ ఐటి ) లో రూ.28 కోట్లతో  నిర్మిస్తున్న భవనాలను  మంత్రి  పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఈ భవనాలను ప్రారంభించనున్నారని అయన అన్నారు. ఈ సందర్బంగా మంత్రి  మట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా నాలుగు వేల మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు శ్రీకాకుళం , నూజివీడు, ఇడుపులపాయ, ప్రకాశం ట్రిపిల్ ఐటీల్లో చదువుకునే అవకాశం లభించనుందన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి సురేష్ అన్నారు. ఏడాదికి కోటి జీతం అందించే సంస్థలకు ఎంపికయ్యేలా ట్రిపిల్ ఐటి విద్యార్థులను తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. నిరుపేద విద్యార్థులను సైతం అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ట్రిపిల్ ఐటీలను ప్రారంభించారని గుర్తుచేశారు. రాజన్న మానసపుత్రికలను అదే స్థాయిలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన్ని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రిపిల్ ఐటీ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.  రూ.185  కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకం పేరిట పక్కదారి పట్టించారని  విమర్శించారు.

శ్రీకాకుళం ట్రిపిల్ ఐటి లో 6 వేలమంది విద్యార్థులకు సరిపడేలా తరగతుల నిర్వహణ, వసతి , ల్యాబ్ వంటి పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. ప్లేసెమెంట్  సెల్ ను బలోపేతం చేసి రిలీవ్ అయిన ప్రతి విద్యార్ధికి ఉపాధి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. వైస్ ఛాన్సలర్ నియామకం త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్ర బడ్జెట్ లో 16 శాతం  (రూ.33,000 కోట్లు) కేటాయింపులు చేసిందని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: