సాధారణంగా జొన్నరొట్టే, రాగి రొట్టే, సజ్జ రొట్టెలు అందరికీ తెలుసు. అయితే నెల్లూరులోని బారాషహీద్ అంటే 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టే, ఉద్యోగరొట్టే, ఆరోగ్య రొట్టే, సంతాన రొట్టే, ఇల్లు రొట్టేలు ఒకరికి ఒకరు పంచుతూ ఉంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు.  వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుంచి కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

 ఈ సందర్భంగా ఈ రొట్టెల పండుగకు సంబంధించిన కథనం. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు.  ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. 


సెప్టెంబరు 10 నుంచి 14వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. ఈ పండుగను సమర్థంగా నిర్వహిం చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. తన  క్యాంపు కార్యాలయంలో ఈ పండుగపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించిందని, ఐదు రోజులు ఈ పండుగ జరుగుతుందన్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. లక్షలాది భక్తులు బారాషాహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువుకు వచ్చే అవకాశం ఉన్నందున పండుగ రోజులలో తొక్కిసలాట జరుగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  యాత్రికులకు భద్రత కల్పించటంతో పాటు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. 


బోటింగ్‌ వద్ద లైఫ్‌ జాకెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.  వైద్య సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యక్రమాలు వివరించే ఛాయాచిత్ర పదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పండుగ రోజులలో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వీరభద్రరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: