రాజకీయాల్లో ఓవర్‌ నైట్‌ ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నాయకులు క్షణక్ష‌ణానికి మార్చుకుంటున్న వ్యూహాలతో రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా విజయవాడ రాజకీయాల్లోనూ ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది. యువ నాయకుడు, తెలుగు యువత అధ్యక్షుడు, టీడీపీలో యువతకు ఐకాన్‌గా మారిన నేత దేవినేని అవినాష్‌.. టీడీపీకి రాజీనామా చేశార‌న్న వార్త విజయవాడలో సంచలనంగా మారింది. వాస్తవానికి నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన అవినాష్‌.. అక్కడ గెలిచి తీరుతానని శపథం చేశారు. 


అంతేకాదు, గుడివాడలో గెలిచి.. చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెప్పారు. గుడివాడ‌లో అవినాష్ కొడాలి నానిపై కొద‌మ‌సింహ‌లా త‌ల‌ప‌డ్డారు. అయితే, జగన్‌ సునామీతో ఓడిపోయారు. ఈ బాధ నుంచి అత్యంత వేగంగానే కొలుకున్నప్పటికీ.. ఆయన పార్టీ మారిపోవడం మాత్రం సంచలనంగా మారింది. ఈ విషయంలో గుడివాడ నుంచి గెలిచిన, ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత మంత్రి కొడాలి నాని సాయం చేశారని తెలుస్తోంది. సరే ఏదేమైనా.. అవినాష్‌ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు కోరే అవకాశం ఉంది. 


కానీ, ఇప్పటికే ఇద్దరు కీలకమైన నాయకులు ఇక్కడ వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కాగా, మరొకరు ఇటీవల ఎన్నికల్లో ఓడిన బోప్పన భవకుమార్‌. ఇటవల ఎన్నికల్లోనే యలమంచిలి వైసీపీ టికెట్‌ ఆశించారు. అయితే, పార్టీ కోసం చివరి నిముషం వరకు కృషి చేసిన బొప్పన వైపే జగన్‌ మొగ్గు చూపారు. అయితే, ఎన్నికల్లో ఆయనకు ఆశించిన ఓట్లు రాలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కూడా కీలకంగానే ఉన్నారు. 


ఇప్పుడు ఈ స్థానంలో అవినాష్‌ ఎంట్రీతో ఈ ఇద్దరు నేతల పరిస్థితి ఏంటి? అనే చర్చ ముందుకు వచ్చింది. ముగ్గురూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జగన్‌ పార్టీని ఇక్కడ ఎలా సమతుల్యం చేస్తారు? నేతల మద్య ఎలాంటి ఆధిపత్య ధోరణులు పెరగకుండా ఎలా చూస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. మరి భవిష్యత్తు ఈ ఇద్దరు నాయకులకు ఎలా ఉంటుందో? లేక ఎండ్‌ అయిపోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: