ఎపీలో ఆగని వానలు వల్ల వరద నీరు వస్తోంది. పోలవరం ప్రాజెక్టును గోదావరి వరద నీరు పూర్తిగా చుట్టుముట్టింది. స్పిల్‌వే వైపునకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాఫర్‌ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు ఉండడం వల్ల.. వరదను స్పిల్‌వే మీదుగా అధికారులు మళ్లించారు.

స్పిల్‌వే రివర్స్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే గేట్ల క్లస్టర్‌ లెవెల్‌ ఎత్తు 25.72 మీటర్లు ఉంది. నీటిమట్టం ఎత్తు మరో అరమీటరు పెరిగితే నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత ఐదేళ్లలో గోదావరికి వచ్చిన అతి పెద్ద వరద ఇదే కావడం గమనార్హం. స్పిల్ వే నుంచి స్పిల్ చానెల్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరిలో ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువర భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులను దాటింది.

 ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలకు పూర్తి స్ధాయిలో రాకపోకలు స్తంభించాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు వెళ్లడానికి సైతం మార్గం లేకపో వడంతో పోలీస్‌ రెవెన్యూ అధికారులు ఏజెన్సీ గ్రామాలకు సహాయక చర్యలు చేసే నిమిత్తం ప్రత్యామ్నాయాల కోసం దారులు వెతుకుతున్నారు. 
''ప్రస్తుతం  ధవళేశ్వరం బ్యారేజ్‌ దిగువన ఉన్న అనేక లంక గ్రామాల్లోకి నీరు ప్రవహించింది. లంక గ్రామాల ప్రజలు పడవల్లోనూ తిరగలేనంతగా వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద అన్ని గేట్లను ఎత్తివేసి 7 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ వద్ద 51 అడుగుల నీటిమట్టం ఉంది.''  అని రాజమండ్రి నుండి బన్ను రాజు అనే న్యాయ వాది తెలియ చేస్తున్నారు


ఇదిలా ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న చాలా ప్రాముఖ్యత కలిగిన గండి పోశమ్మ. వరద నీరు రావడంతో అమ్మవారి గుడిలో సగం పైగా గోదావరి నీట మునిగి మూల విగ్రహం ఇలా కనిపిస్తోంది. ఈ గుడి చుట్టూ ఇంతలా నీరు రావడం మొదటిసారి అని అంటున్నారు.పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యేటప్పటికి ఈ గుడిని ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌ పని సగంలో ఉన్నందువల్లే ఇంత వరద వచ్చిందని,ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని , ప్రతి ఆదివారం,మంగళవారం కొన్ని వందల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అని, స్థానికులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: