గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల రాకతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. పంటలను చాలా మంది ఇప్పటికే వేశారు. వరి నాట్లు కూడా రాష్ర్టవ్యాప్తంగా వేస్తున్నారు. వర్షాల రాకతో నవ్యాంధ్రుల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్‌కు గంట గంటకూ వరద నీటి ఉధృతి పెరుగుతోంది.

ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు రిజర్వాయర్‌లోకి 2,33,824 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం మొత్తం కెపాసిటీ 215.81 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 98.51 టీఎంసీలకు పెరిగింది. 885 అడుగులకు 858 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అవుట్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు ఉంది అయితే శనివారంతో పోలిస్తే ఎగువ నుంచి వచ్చే వరద స్వల్పంగా తగ్గింది. కాలువలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.

ఇక తుంగ భద్రలోకి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీని మొత్తం కెపాసిటీ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.50 టీఎంసీలు నీరు ప్రాజెక్టులో ఉంది. 1,633 అడుగులకు గాను 1,609 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 17,817 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో కాలువలకు 1,289 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండ డంతో ప్రాజెక్టులో గంట గంటకూ నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 126.14 టీఎంసీలు ఉంది. 590.55 అడుగులకు గాను ప్రస్తుతం కేవలం 506.69 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం అస్సలే లేదు. కాలువలకు 463 క్యూసెక్కులు విడుదల చేశారు.

ఇదిలా ఉంటే జూరాల ప్రాజెక్టులోకి ఇంకా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తూనే ఉంది. 9.66 టీఎంసీల నీటి మట్టానికి ఇప్పుడు 9.22 టీఎంసీలు నీరు ఉంది. 1,045 అడుగుల నీటి మట్టానికిగాను 1,044 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2, 37,638 క్యూసెక్కుల వరద నీరొచ్చి ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో అంతే స్ధాయిలో నీటిని దిగువునకు వదిలేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు లోకి కృష్ణమ్మ గల గలా పరుగులు తీస్తోంది. వరద ఇలాగే కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందంటున్నారు. ఆ తర్వాత వచ్చిన వరదనంతా శ్రీశైలంలోకి వెళుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు మరింత శరవేగంగా నిండుతుందని అంతా ఆశిస్తున్నారు.

ఇక బ్యారేజీలకు పెద్ద ఎత్తున గోదావరి వరద పోటెత్తి ఉప్పొంగి ప్రవాహిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది . ఇక్కడ ప్రస్తుతం 57.05 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 55.81 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గి పోయిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కేవలం ఎగువ నుంచి 13,839 క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చి బ్యారేజీలోకి చేరుతుంది. దీంతో 8,987 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: