సముద్రజలాలతో సాగు చేస్తున్న ఎడారి నేల!!
మనసుంటే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే, ఇజ్రాయెల్‌ ప్రజలు నీటి కొరతకు పరిష్కారం కనుగొన్నారు.
సాగర మధనం చేసి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చారు. బొట్టుబొట్టూ ఒడిసి పట్టి ఎక్కడా ఒక చుక్క నీరు వృధా  కాకుండా కాపాడుకుంటున్నారు. సరికొత్త వ్యవసాయ విధానాలను పాటిస్తూ, నీటి నిర్వాహణలో ప్రపంచానికే కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో కరువును తగ్గించిన,చుక్కల సాగు,తుంపర సాగు విధానాలను ఇజ్రాయెల్‌ నుండి నేర్చుకున్నవే..


అందుకే, ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ ఆదివారం(5.8.2019) ఇజ్రాయెల్‌లోని హడేరాలో హెచ్‌టూఐడీ డీశాలినేషన్‌ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును చూసి విశేషాలు అధ్యయనం చేశారు. సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ప్లాంటు అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. మంచినీటి తయారీ ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చు, ఇతర వ్యయం వంటి అంశాలను విపులంగా వివరించారు. ఆ తర్వాత జగన్‌ ప్లాంటు మొత్తం తిరిగి పరిశీలించారు. మంచినీటి తయారీ ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అక్కడి అధికారులను అభినందించారు. అక్కడ తయారైన మంచినీటిని రుచి చూసి చాలా నాణ్యతతో ఉన్నాయంటూ ప్రశంసించారు.
హడేరా ప్లాంటులోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ రఫీ షామీర్‌ ఈ ప్లాంటు సందర్శనను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ని ఆకట్టుకున్న ఇజ్రాయెల్‌లో గురించి తెలుసుకుందామా..?


 ఏడాది పొడవునా నీటి కొరతే!!
 దాదాపు 88లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్‌లో చాలా వరకు ఎడారి ప్రాంతమే. కేవలం 10శాతం భూభాగం మాత్రమే నివాసయోగ్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన సమస్య మంచి నీరు. ప్రపంచం లో కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలంలో నీటికి కటకట ఉంటుంది. కానీ ఈ ఎడారి దేశంలో ఏడాది పొడవునా నీటి కొరతే!! అతి స్వల్ప వర్షపాతం వల్ల, నీరు లభించక అది చాలా విలువైన వస్తువుగా మారింది.
అంతేకాదు ఆ దేశ ప్రభుత్వం నీటిని జాతీయ సంపదగా ప్రకటించింది.


నీటి ఎద్దడిని జయించారు... 
ఈ భూమండలంపై ఇజ్రాయెల్‌ అంతటి పొడినేల మరొకటి లేదు. భూగర్భ జలాలు కొంచెం కూడా పెరగకముందే వర్షాకాలం వెళ్ళి పోతుంది . దీంతో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకునే పద్ధతులను ఇజ్రాయెల్‌ ఒంటబట్టించుకొని , నీటి యాజమాన్యంలో ఆ దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడం దగ్గర నుంచి బిందుసేద్యం వరకు నీటిపొదుపు విషయంలో ఆ దేశం ఆవిష్కరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంతో సహా, చాలా దేశాలు అనుసరిస్తున్నాయి . అయితే ఇపుడు అక్కడ పరిస్ధితి మారింది. నీటి నిర్వాహణ బాగానే ఉన్నా.. ప్రజలు విచ్చలవిడిగా వాడేస్తుండటంతో నీటి ఎద్దడి పెరిగింది. గత కొన్నేళ్లుగా కరువు కారణంగా నీటి వనరులు కనుమరుగయ్యాయి. పొరుగున ఉన్న జోర్డాన్తో పాటు పాలస్తీనాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.

 ఖరీదైన వ్యవహారం
నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలు మాత్రమే పెంచాలని, పెద్దగా తడి అవసరంలేని పంటలే పండిచాలని ప్రభుత్వం సూచించింది. సముద్రం నీటితో సాగు... అక్కడితో ఆగకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు, ప్రభుత్వం సముద్రపు నీటిని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తు పరిశోధనలు చేపట్టింది. సముద్రం నీటిని శుద్ధి చేసే డీ సాలినేషన్‌ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. మధ్యధరాసముద్ర తీరం నుంచి సముద్ర జలాలను తీసుకునే సదుపాయం ఉండటంతో 2005 నుంచి ఇప్పటి వరకు 5 అతిపెద్ద డీ సాలినేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా మంచి నీటి లభ్యత పెరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 40శాతం నీటి అవసరాలను ఇవే తీరుస్తున్నారు. 2050 నాటికి ఇది 70 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.
 నిజానికి ఈ యూనిట్ల నిర్వాహణ ఎంతో ఖరీదైన వ్యవహారం. భారీ స్థాయిలో విద్యుత్‌ అవసరమవుతుంది. అయినా నీటి కరువు నుంచి బయటపడాలంటే కొత్త యూనిట్లను స్థాపించడమే మార్గమని ఆ ప్రభుత్వం భావిస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: