అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ..కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దయింది. దీంతో కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి.ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి ? అదెందుకు రద్దు చేశారు వంటి వివరాలను వివిధ రాజకీయ విశ్లేషకుల రచనలు, వార్తాపత్రికల కథనాల ఆధారంగా అందిస్తున్నాం.



ఇంతకూ ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి ? కశ్మీర్‌ లోయలో శాంతి నెలకొనాలంటే.. ముందుగా కావాల్సింది కాశ్మీర్‌ సమస్యపై ఓ జాతీయ అవగాహన. గత 71 సంవత్సరాలలో కాశ్మీర్‌ రగులుతున్నా అన్ని ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలతోనే కాలం వెళ్లబుచ్చుతూ వచ్చాయి. అలాగే పాకిస్తాన్‌ విషయంలో కూడా ఓ జాతీయ అవగాహన లేకుండాపోయింది. ఈ రెండింటిని కలిపే ఒక జాతీయ విధానం తీసుకురావాలి. అలా జరగాలంటే వివాదాస్పద ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35-ఎ లను రద్దు చేయాలి.


'' దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగమే శరోధార్యం. మరి, కశ్మీర్‌ లో మాత్రం రాజ్యాంగానికి విలువ లేకుండాపోయింది..? దేశ విభజన జరిగిన నాటి నుంచి కశ్మీర్‌ రావణకాష్టంలా మండుతూనే ఉంది. ఎందరో వీరజవాన్లు, అమాయక ప్రజలు అమరులవుతూనే ఉన్నారు. దీనికంతటికీ కారణం ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35-ఎ కల్పిస్తున్న వెసులుబాటేనని..'' జాతీయ రాజకీయ విశ్లేషకులంటున్నారు.


1954లో రాష్ట్రపతి ఉత్తర్వులతో 35ఏ అధికరణను రాజ్యాంగంలో పొందుపరిచారు, దాని ప్రకారం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా లభిస్తుంది. ఈ అధికరణ జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్నదని... దీని ప్రకారం భారత దేశానికి చెందిన ఇతర రాష్ట్రాల పౌరులు జమ్మూకశ్మీర్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఏన్నో ఏళ్ల నుంచి జమ్మూలో ఉంటున్న తమకు స్థిరాస్తులు కొనుగోలు చేసే హక్కులు లేవని..., అలాగే జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగే ఎన్నికలతోపాటు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమకు ఓటు హక్కు లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే పాకిస్తాన్‌ లో స్థిరపడి ఆతర్వాత కశ్మీర్‌ లోయలోకి వచ్చినవారికి మాత్రం సర్వహక్కులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.


భారత యూనియన్‌ లోని అనేక రాష్ట్రాలలో జమ్మూకశ్మీర్‌ కూడా ఒకటి...! కానీ మరే రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు ఈ రాష్ట్రానికి చాలానే ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెల్లుబాటు అయ్యే భారత రాజ్యాంగం కశ్మీర్‌ లో మాత్రం చెట్లుబాటు అయ్యేది అంతంత మాత్రమే..! కశ్మీర్‌ రాష్ట్రా సర్కార్‌ ఒప్పుకుంటే తప్ప...భారత పార్లమెంటు చేసే ఏ చట్టమూ-జమ్మూకశ్మీర్‌ కు వర్తించదు. ఇదంతా అర్టికల్‌ 370 చలువే...! ఇవే ఒక్కటే కాదు..ఇంకా ఇలాంటి ఎన్నో ఈ అర్టికల్‌ లో ఉన్నాయి.


1. అర్టికల్‌ 370తోపాటు...ఆర్టికల్‌ కారణంగా జమ్మూకశ్మీర్‌ లో ముఖ్యంగా జమ్మూ,లఢక్‌ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎన్నో వివక్షలకు గురవుతున్నారనే వాదనలు ఉన్నాయి..!

2.మన దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఐదేళ్లు మాత్రమే ఉంటుంది..! కానీ అదే జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ కాలపరిమితి మాత్రం ఆరేళ్లు...! అంతేకాదు దేశ విభజన సమయంలో ఆస్తులు, ఆప్తులను కోల్పోయి జమ్మూకు వలస వచ్చిన హిందువులకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. అదే సమయంలో వారు లోకసభ ఎన్నికల్లో మాత్రం ఓటు వేయవచ్చు...! కారణం ఆర్టికల్‌ 35ఏ కారణంగా వారికి పర్మినెంట్‌ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ లేకపోవడమే అందుకు కారణం!

3. లోక్‌ సభకు మాదిరిగా, ప్రతి రాష్ట్రంలోని లెజిస్టేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికలు వయోజనుల ఓటింగు పాతిపాదికన జరుగుతుంది. భారత పౌరుడై ఉండి 18 ఏళ్లవయస్సు నిండి ప్రతి వ్యక్తి ఎన్నికలలో ఓటరుగా నమోదు అయ్యే హక్కు కలిగి ఉంటారని భారత రాజ్యాంగం 326వ అధికరణం చెబుతోంది. రాజ్యాంగమే ఓటు హక్కు ఇచ్చింది కదా అని జమ్మూకశ్మీర్‌ లో నివసించే ఏ భారత పౌరుడికైనా అక్కడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఆటోమేటిగ్గా లభిస్తుందని అనుకుంటే పొరపాటే! భారత రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం 18 ఏళ్లు నిండి, భారత పౌరసత్వం ఉన్నంత మాత్రాన కశ్మీర్‌ అసెంబ్లీ కి ఓటు వేయడానికి సరిపోదు. ఆ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం శాశ్వత నివాసులుగా గుర్తింపు ఉన్నవారు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది.

4.జమ్మూకశ్మీర్‌ లో ఎవరు శాశ్వత నివాసులు అన్న పదాన్ని నిర్వహించడం కోసం వారికి ప్రత్యేక హక్కులు, అధికారులు కల్పించేందుకు....ఆనాటి ప్రధాని నెహ్రూ-షేక్‌ అబ్దుల్లా ఒత్తిడితో...ఆర్టికల్‌ 35ఏను తీసుకువచ్చారు.

5.జమ్ము కశ్మీర్‌కు చెందిన మహిళ ఆ రాష్ట్రం వెలుపలి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే ఆమెకు, ఆమె సంతానానికి ఆ రాష్ట్రంలో ఆస్తి హక్కులు, ఉపాధి అవకాశాలు ఉండవు.

6. శాశ్వత నివాసులుగా గుర్తింపు పొందినవారు మాత్రమే అక్కడి కళాశాలల్లో ప్రవేశాలకు, ఉపకార వేతనాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇతరత్రా సర్కారీ సాయాలకు అర్హులు. ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలుకు, స్థిర నివాసానికీ వారే అర్హులు.

7, శాశ్వత నివాసులుగా గుర్తింపు లేనివారికి ఈ హక్కులేమీ ఉండవు. 1954 మే 14 తేదీనాటికి ఆ రాష్ట్ర పౌరులుగా ఉండి అప్పటి నుంచి వంశ పారంపర్యంగా అక్కడ నివసిస్తూ స్థిరాస్థి కలిగి ఉన్నవారు మాత్రమే ఆ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం శాశ్వత నివాసులు. ఇది సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనది..!

8. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జమ్ము కశ్మీర్‌ లో స్థిరపడిన వారు, పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన హిందువులు కశ్మీర్‌ రాజ్యాంగం ప్రకారం శాశ్వత నివాసులు కారు. వీరికి లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. కానీ కశ్మీర్‌ అసెంబ్లీకి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు.

9.మన దేశంలో ఏ రాష్ట్ర విధానసభకు, విధానమండలికి ఎన్నికయ్యే ఏ సభ్యుడైనా భారత రాజ్యాంగానికి పూర్తి విధేయత, విశ్వాసం కలిగి ఉంటానని ప్రమాణం చేసి తీరాలని 188వ అధికరణంలో పేర్కొన్న థర్డ్‌ షెడ్యుల్‌ నిర్దేశిస్తోంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కి, న్యాయమూర్తులకు కూడా ఈ ప్రమాణం తప్పనిసరి. కానీ జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు...ఆ రాష్ట్ర రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని...అలాగే చేసి తీరాలని కశ్మీర్‌ రాష్ట్ర రాజ్యాంగం 64,97 సెక్షన్లు చెబుతున్నాయి.

10. భారత ఎలక్షన్‌ కమిషన్‌ కమిషనర్లను...రాజ్యాంగం 324 అధికరణం కింద భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కు జుమ్ము కశ్మీర్‌ లో ఎన్నికలు నిర్వహించాలంటే... ఆ రాష్ట్ర రాజ్యాంగం 138వ సెక్షన్‌ ప్రకారం అక్కడి పాలకుల నుంచి నియామక పత్రం పొందితేగానీ ఎన్నికలు నిర్వహించలేరు.

11.కొన్ని దశబ్దాల నుంచి కశ్మీర్‌ లోనే స్థిరపడ్డ వారైనా సరే... శాశ్వత నివాసులు అన్న గుర్తింపు లేకపోతే... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు.. ఆ రాష్ట్రంలో ఎక్కడా స్థిరాస్తి కొనడానికి వీల్లేదు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియమకాల్లో వారికి అవకాశం దక్కదు.

12. కశ్మీర్‌ లో శాశ్వత నివాసి అర్హత లేని వారు ఆ రాష్ట్ర అసెంబ్లీకే కాదు కనీసం గ్రామపంచాయితీలో సభ్యుడు కాలేడు. 1947 దేశ విభజన విషాధ ఘటనలో చితికి శరణార్థులుగా జమ్మూకు వచ్చి స్థిరపడిన హిందువులకు ఇప్పటికి జమ్మూకశ్మీర్‌ పర్మినెంట్‌ రెసిడెన్స్‌ సర్టిఫికేటే లభించలేదు.


మారిన కశ్మీర్‌ ముఖచిత్రం!!

నేటితో జమ్ము కశ్మీర్‌ ముఖచిత్రాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోని, ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. జమ్ము కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసేలా జమ్ము, కశ్మీర్‌, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: