సోమ‌వారం పార్ల‌మెంటులో క్ష‌ణాల్లో సీన్ మారిపోయిన సంగ‌తి తెలిసిందే.ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనపై మొదటి నుంచీ గోప్యత పాటించిన కేంద్ర ప్రభుత్వం.. బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేవరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ మేర‌కు ర‌ద్దు చేయ‌డం, త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం జ‌రిగిపోయాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు, క‌మ్యూనిస్టులు ఆసక్తిక‌ర రీతిలో స్పందించారు. 


హోమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్  మాట్లాడుతూ, ఆర్టికల్ 370, 35-ఏ రద్దు, రాష్ర్టాన్ని రెండు ముక్కలుగా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ను హత్యచేసిందని మండిప‌డ్డారు. జమ్ముకశ్మీర్‌ను భారతదేశ కిరీటంగా అభివర్ణిస్తుంటారు. అలాంటి రాష్ర్టాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా తల నరికేశారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఒకరోజు చూడాల్సి వస్తుందని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ పాలన పరిధిలోకి తేవడం సిగ్గుపడాల్సిన విషయమని విరుచుకుపడ్డారు. రాష్ర్టాన్ని విభజించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా భారతదేశ పటం నుంచి జమ్ముకశ్మీర్‌ను తొలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు.   దమ్ముంటే గుజరాత్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ బిల్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. చివరగా జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 


కాగా, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370 రద్దు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రత్యేక పరిస్థితుల్లో కాశ్మీర్‌ ప్రజలు కొన్ని ప్రత్యేక హక్కులు పొందారని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాశ్మీర్‌ సమస్య మరింత జఠిలమవుతుందని చెప్పారు. కాశ్మీర్‌ ఇప్పుడే భారత్‌లో అంతర్భాగమైనట్టు బీజేపీ అబద్ధపు ప్రచారం కొనసాగిస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: