క్రికెట్ మైదానం లోనే కాదు ... బయట కూడా పాక్ ఆటగాడు ఆఫ్రిది , భారత్ మాజీ క్రికెటర్ , బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతోంది . తాజా భారత్ ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్ రద్దుపై ఆఫ్రిది స్పందిస్తూ కశ్మీరీ ప్రజల హక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు . భారత్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే , ఐక్యరాజ్య సమితి నిద్రపోతుందని మండిపడిన ఆఫ్రిది , ఈ వ్యవహారం లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని కోరారు .


 మానవ హక్కుల ఉల్లంఘన గురించి పాక్ ఆటగాడు ఆఫ్రిది మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన గంభీర్ , అసలు మానవ హక్కుల హననం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు . భారత్ లో అంతర్భాగమైన కశ్మీర్ ప్రజల హక్కుల గురించి ఆఫ్రిది ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న గంభీర్ , ముందు ఆక్రమిత కశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన పై స్పందిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు . భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేయడం పట్ల పాకిస్థాన్ కేంద్ర విదేశాంగ మంత్రి , ఆ దేశ ప్రధాని సైతం ఇంచుమించు ఆఫ్రిది మాదిరిగానే స్పందించిన విషయం తెల్సిందే .


 కానీ భారత్ లోని కోట్లాది మంది ప్రజలు మాత్రం మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తూ , సంబరాలు జరుపుకుంటున్నారు .గత 70 ఏళ్లుగా రావణ కాష్టంగా రగులుతున్న కశ్మీర్ లోయలో మోడీ సర్కార్ నిర్ణయం తో ప్రశాంతత నెలకొంటుందన్న ఆశాభావం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: