మంగళవారం, ఢిల్లీలో ఏపీ సీఎం, వై.ఎస్‌. జగన్‌ పార్లమెంట్‌ లో ప్రధాని మోడీని కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5103 కోట్లను వెంటనే విడుదల చేయాలని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఎప్పటికప్పుడు ఆర్థిక వనరులు సమకూర్చాలని నివేదిస్తూ, పోలవరం పై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ప్రధానికి సమర్పించడంతో పాటు, గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు తరలించే ప్రతిపాదనను కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేందుకు జీఎస్‌టీ, ఆదాయపు పన్నుల్లో రాయితీలివ్వాలని కోరారు.


ఢిల్లీలో హడావడిగా జరిగిన చర్చలు, విజ్ఞప్తులు అన్నీ ఒకెత్తయితే, జగన్‌ తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఉండటం మీడియాను ఆకర్షించింది.

ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా ఆమెను ఏపీకి బదిలీ చేయాలని తెలంగాణను కోరగా అందుకు కెసిఆర్‌ కూడా ఓకే అన్నారు. కానీ, కేంద్ర హోంశాఖ వద్ద ఈ అంశం పెండింగ్‌లో ఉండగా , ఇప్పుడు సీఎం శ్రీలక్ష్మిని వెంటబెట్టుకుని ప్రధానిని కలవడం ఆసక్తిగా మారింది. మరి మోడీ ఒకే అన్నారా? లేదా ? అన్నది అతి త్వరలోనే తేలనుంది.


.గతంలో , జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలు పాలై, విచారణను ఎదుర్కొన్నశ్రీలక్ష్మి కి చివరికి కోర్టులో ఊరట లభించింది. దీంతో మరోసారి ఆమె విధుల్లో చేరి, ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి ఇపుడు ఏపీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఆమె బదిలీకి ఎందుకంత పట్టుదల?

1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ శ్రీలక్ష్మి వైఎస్‌ హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పని చేశారు. చిన్న వయసులోనే సివిల్స్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఓబుళాపురం గనుల కేసులో జైలుకు వెళ్లడం వల్ల ఆమె భవిష్యత్‌ పై తీవ్ర ప్రభావం చూపింది. లేదంటే ఆమె కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయిని చేరుకునేవారు. గనుల కేసులో నిర్దోషిగా తేలడంతో, 2016 అక్టోబర్లో ఆమె మళ్లీ విధుల్లో చేరారు. తమ కోసం కష్టాలు పడి,వేదనకు గురైన ఆమెకు ఎలాగైనా మేలు చేయాలనే తలంపుతోనే, సీఎం జగన్‌ సైతం శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకొచ్చి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.... అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: