గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సుష్మా స్వరాజ్ ను ఆకస్మికంగా గుండె పోటు రావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స అందిస్తుండగానే మద్యలోనే సుష్మా కన్నుమూశారు.కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో కన్నుమూశారు. సుష్మా పార్ధివదేహాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని బీజేపీ కార్యాలయానికి తరలిస్తారు. మూడు గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. సుష్మా స్వరాజ్ అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యే గా పని చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.



సుష్మా స్వరాజ్ ఇటీవలే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. దీంతో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. జీవితంలో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ జమ్ము కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుకూ లోక్ సభ ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మా స్వరాజ్ ఎవిపి నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977 లో తొలి సారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టారు.1996-98 లో వాజ్ పై మంత్రి వర్గంలో పనిచేసారు. 1998 లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.



1999 లో బల్లారిలో సోనియా పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి పై పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. సుష్మా స్వరాజ్ అకాల మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో మహోన్నతమైన శకానికి తెరపడిందన్నారు. సుష్మా స్వరాజ్ కు ఎందరో ప్రజలకు ప్రేరణ కల్పించారు. పేద ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నించారు. అహర్నిశలు దేశ సేవ కోసం తపించారు అంటూ మోదీ ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అకాల మృతి తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు.పార్టీలకు అతీతంగా ఆమెకు ఎంతో మంది మంచి స్నేహితులు ఉన్నారన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.



సుష్మా స్వరాజ్ మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం తెలిపారు. సుష్మా అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎపి సీఎం జగన్ అన్నారు. అపార అనుభవం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నాయకురాలు ఆమె అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా మన్ననలు అందుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు.



దేశానికి సుష్మ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం తీరని లోటని తెలిపారు. సుష్మ భౌతికకాయం దగ్గర నేతల నివాళి అర్పించారు. సుష్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆమె మృతి తీరని లోటని తెలిపారు. సుష్మా దేశానికి ఎనలేని సేవ చేశారని ట్వీట్ చేశారు. సుష్మ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సుష్మ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: