కృష్ణా జిల్లా టిడిపి నేతలు ఓటమి పాలయ్యాక తప్పులు వెతుక్కుంటున్నారు. పార్టీలో అందరికీ ప్రజలతో సత్సంబంధాలు లేకపోవటం వల్లే ఓడిపోయామని తేల్చారు. భవిష్యత్తులో అటువంటి పొరపాటు జరగకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సూక్తిని మననం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పరాజయం పాలై రెండు నెలలైంది. కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి కేవలం రెండంటే రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామంతో పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యింది.



విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో తాను కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోవడం బొండా ఉమామహేశ్వరరావుకి జీర్ణం కావడం లేదు. ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధి కేశినేని నానికి నాలుగు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బుద్దా వెంకన్న తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. నగర అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేశారు. తాను రాజీనామా చేసినంత మాత్రాన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు కాదని పార్టీలో ఏ పదవి ఇచ్చినా అంకితభావంతో చంద్రబాబు కోసం పని చేస్తానని బుద్దా వెంకన్న ప్రకటించారు.


ఇదే సమయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతని నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన సూచించారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ చేసిన సూచనలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరావు పని ఒత్తిడి కారణంగా ఎవరినీ కలవలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా సరే అన్ని మండలాలకు ఉమా వెళ్లాలనీ పార్టీ నేతల్ని కలవాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. 2004 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన దేవినేని ఉమ ఎలా విస్తృతంగా కలియదిరిగారో, మళ్లీ అదే విధంగా ప్రజల మధ్య తిరగాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందని అందువల్లే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయామని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.


అందువల్ల కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల హ్యూమన్ టచ్ కావాలని కోరుకుంటున్నారని ఆయన చేసిన విశ్లేషణ మిగతా టిడిపి నేతల్ని ఆలోచింపజేసింది. సమన్వయ కమిటీ సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడుతూ ఇకపై అందరం కలిసి పని చేద్దామని చిన్న చిన్న విభేదాలుంటే పక్కనపెడదామని సూచించారు. ఈ రెండు నెలల్లోనే సీఎం జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని ఆయన చెప్పారు. అన్న క్యాంటిన్ల మూసివేత, పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ను ఆకస్మికంగా తొలగించడం, 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన వైయస్ జగన్ ఆ తర్వాత మాట మార్చడం వంటి విషయాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమా ఇతర నేతలు విశ్లేషించారు.


స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. పంచుమర్తి అనూరాధ, పట్టాభి వంటి నేతలు పార్టీ వాయిస్ ను బాగా వినిపిస్తున్నారని మిగిలిన నేతలు కూడా అదే పంథాలో సాగాలని ప్రతిపక్షంలో ఉన్నందున పార్టీ వాయిస్ వినిపించడంతో పాటు ప్రజా సమస్యలపై గట్టిగా గళమెత్తాలని పలువురు సూచించారు. సమావేశంలో పాల్గొన్న నేతలందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని నగరంలో లేకపోవటంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. పార్టీలో ఎప్పటికప్పుడు అంతర్గత విశ్లేషణ చేసుకుంటూనే లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. మరి ఈ సమావేశం తర్వాత తెలుగుదేశం నేతల ఏజెండా ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: