ఏసీ గదిలో కూర్చుని రిపోర్ట్ చేస్తే..జీవితానికి మజా ఏముంటుంది.. రిస్క్ చేయాలి.. అప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుంది అనేది, టీవీ జర్నలిస్టు అశోక్ వేములపల్లి. పాలసీ.. వరద గోదావరి వార్తలు కవర్‌ చేస్తూ, దారి తప్పి, ప్రమాదాల పడవ ప్రయాణంలో, మరణం అంచుల వరకు వెళ్చొచ్చి, తన అనుభవాలను తన ఫేస్‌బుక్‌ వాల్‌ పై అద్భుతంగా అవిష్కరించారు...ఊపిరి బిగబట్టి చదవండి !!

'' ఇదంతా ఎందుకు.. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను గోదాట్లోకి.. నువ్వు అంతలా పగలదీసి ఇరగదీసి వార్తలు కవర్ చేయకపోతే ప్రపంచానికి నష్టం ఏమన్నా వచ్చిందా.. అలా బోటులో రిస్క్ తీసుకుని వెళ్లి ఏడ్వకపోతే మీ కంపెనీ వాళ్ళు జీతం ఇవ్వరా అనే ప్రశ్నలు చాలా మంది నుంచి వచ్చాయి..నిజానికి నా మేనేజ్మెంట్ నాకు అంత రిస్క్ తీసుకోమని చెప్పలేదు.. నేను కూడా ఏ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర, లేదా ఏ లంకలోనో నీళ్లు చూపిస్తూ రిపోర్ట్ చేయొచ్చు.. ఎవరూ ఏమీ అనరు ఆ సంగతి నాకు తెలుసు.. కానీ ఏదో చేయాలి..ఇంకేదో సాధించాలన్న తపన .. నన్ను నడిపించింది.. జర్నలిజం మీద నాకున్న ఇష్టం నదిలో కి పంపించింది.. గోదావరి వరదల కవరేజ్ NTV లో గంటన్నర పాటు నాన్ స్టాప్ గా టెలికాస్ట్ చేశారు.. అది చూసి చాలామంది ఫోన్లు చేసి అద్భుతంగా రిపోర్ట్ చేశావని పొగుడుతూ ఉంటే ఎందుకో ఆనందం అనిపించలేదు..బతికితే చాలు అన్న.. భయం ఇప్పటికి వెంటాడుతూనే ఉంది.. గోదావరి గాలి తాకినప్పుడల్లా మృత్యు భయం గుర్తొస్తూనే ఉంటోంది.. బయటి ప్రపంచానికి ఈ కష్టాలు తెలియవు.. బోటులో ఎంజాయ్ చేస్తూ రిపోర్ట్ చేసారని కొందరు అనుకుంటారు.. ఫేస్ బుక్ లో పీకల్లోతు నీళ్ళల్లో రిపోర్ట్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేస్తే చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు.. వీడేదో పొడిచేసినట్టు ఇక్కడ ఫోజులు కొడుతూ ఫోటోలు పెడుతున్నదని నవ్వుకున్నవాళ్ళు ఉన్నారు.. ఒక వ్యక్తి తపన, కసి, కష్టానికి రూపం ఉండదు..''


మృత్యు 'గో'దారి'... 

ఇదే జీవిత చివరి ప్రయాణం అనుకున్నా ....వరద గోదారి మమ్మల్ని కలిపేసుకుంటోందని భయపడ్డా ........చివరిసెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశా .......ఒక పక్క గోదారి వరద , భారీ వర్షం , ఈదురుగాలి .......ఊగుతున్న బోటు ... బోటులోకి నీళ్లు .......వరదల కవరేజ్ లో నా భయానక అనుభవం. 

 మొదటిసారి గోదావరి అంటే భయమేసింది .. అది ఈసారి గోదావరికి వచ్చిన వరదల కవరేజ్ కి దేవీపట్నం వెళ్లి తిరిగి వచ్చేప్పుడు ఈ అరగంట గడిస్తే చాలనిపించింది ..గోదావరి ఉగ్ర రూపం చూసి ప్రాణ భయంతో అల్లాడాను .. ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఇంట్లో చెప్పి రావాల్సింది అనిపించింది .. పిల్లలు గుర్తొచ్చి బాధపడిన క్షణాలు అవి ..చివరి సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసేశాను .. బతికుంటే ఏదైనా చేసుకుని బతకొచ్చు కానీ ఇంతటి రిస్క్ అవసరమా అని ప్రశ్నించుకున్న సందర్భం ..\


వరదల కవరేజ్ కి రాజమండ్రి వచ్చిన నేను అక్కడి నుంచి రంపచోడవరం మీదుగా చిన రమణయ్యపేట చేరుకున్నాము ..అప్పటికే  గోదావరి వరద నీరు వచ్చేసింది .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోటు మీద దేవీపట్నం బయలుదేరాము.. నేను మా కెమేరామ్యాన్ లక్ష్మణ్ , 4G టెక్నీషియన్ సుబ్బు , మా లోకల్ స్ట్రింగర్ శ్రీనివాస్ ..మేము ఎక్కింది చాలా చిన్న పడవ .. గోదారి ఒడ్డున చిన్న చిన్న వలలు వేసి చేపలు పట్టుకునే పడవ అది .. ఎక్కేముందు బోటు నడిపే వ్యక్తి చెప్పాడు ..ఈ పడవ మీద దేవీ పట్నం వెళ్లను .. వరద బాగా పెరిగింది .. వీరవరం వరకూ మాత్రమే వస్తాను అని .. అయితే అక్కడి ఎస్సై అతనికి సర్ది చెప్పి కాస్త మీడియావాళ్లు లోపల పరిస్తితిని కవర్ చేస్తామంటున్నారు .. పెద్ద బోట్లన్ని జనాలని తీసుకెళ్లడానికి వాడుతున్నాం .. వాళ్లని జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పారు.


సరేనని బోటు ఎక్కి ముందుకి వెళ్తుండగా ఆరుగురు మగవాళ్లు ఒక మహిళ , బోటు ఎక్కారు .. ఇంతమందిని బోటు మోయలేదని చెప్పినా వినలేదు .. మందు కొట్టి ఉన్నారేమో ఇదేమన్నా మీడియా కోసం పెట్టింది కాదు మాకోసం నడిచే బోట్లు అంటూ గొడవకి దిగారు .. సరే మీ ఇష్టం బోటు మునిగితే నాకు సంబంధం లేదంటూ బోటు నడీపే వ్యక్తి ముందుకు పోనిచ్చాడు .. నలుగురు ఎక్కాల్సిన బోటు ఏకంగా పన్నెండు మందితో కదిలింది ..మాకు మరో మార్గం లేదు తప్పని సరై బోటులోనే ఉన్నాం ..


దారిలో వెళ్తుంటే కరెంట్ పోల్స్ పూర్తిగా మునిగిపోయాయి .. కరెంట్ పోల్స్ వైర్ల మీది నుంచి మా బోటు వెళ్తోంది .. అంటే అక్కడ ఎంత స్థాయిలో లోతు ఉంటుందో అంచనా వేశా .. అది మొదట గోదావరి అనుకున్నా కాదు ఇది పంటపోలాల్లోకి వచ్చిన వరద నీరు అని బోటులో వాళ్లు చెప్పారు .. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నిర్మించిన కాఫర్ డ్యాం వల్ల నీరంతా వెనుక గ్రామాలని ముంచెత్తింది .. రేపు డ్యాం కంప్లీట్ అయ్యాక ఎలా ఉండబోతొందో అది ట్రైలర్ చూపించినట్టుగా ఉంది .. అక్కడక్కడ తాటిచెట్లు మునిగి..పైన ఆకులు కనిపిస్తున్నాయి .. వాటి మీద పాకుతున్న పాములు కనిపించాయి .. వరద ప్రవాహానికి భారీ చెట్లు కొట్టుకు వస్తున్నాయి .. కొన్ని చోట్ల కరెంట్ పోల్స్ వైర్ల కింది నుంచి పడవ వెళ్తోంది అలా వెళ్తున్నప్పుడు తల దించమని బోటు డ్రైవర్ చెబుతున్నాడు ..ఎటు చూసినా సముద్రాన్ని తలపిస్తోంది.


మా బోటులో ఉన్న ఒక తాగుబోతు లేచి బోటులో డ్యాన్స్ వేస్తున్నాడు .. ఆడేత్తానే అమ్మి పాడేత్తానే అని పాడుతూ చిందు లేస్తున్నాడు..మా ఊరు మునిగిపోయింది .. నా ఇల్లు కొట్టుకుపోయింది .. ఆ పోలవరం డ్యాం నన్ను ముంచేసిందంటూ ఆరుస్తున్నాడు .. అతడు ఊగుతోంటే అతన్ని ఆపడానికి మిగిలినోళ్లు వెళ్తుంటే బోటు ఒరిగిపోతోంది .. మా ఊరంతా మునిగిపోతే ఒక్కడు పట్టించుకోవట్లేదు .. మీరొచ్చి వీడియో తీసి ఏమి చేస్తారు అని అందులో మహిళ మమ్మల్ని నిలదీసింది .. ఇరవై నిమిషాల జర్నీ తర్వాత వీరవరం గ్రామం వచ్చింది .. మదుకొట్టిన బ్యాచ్ అంతా కిందికి దిగిపోయింది .. అక్కడ మాకు మునిగిపోయిన ఇళ్లు కనిపించాయి .. మరికొన్ని ఇళ్లల్లో జనాలు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ కనిపించారు ..కొన్ని ఇళ్లల్లోంచి గిన్నెలు కొట్టుకుపోవడం కనిపించింది.


అక్కడ నుంచి బోటు ముందుకు కొయ్యేరు మీదుగా సాగింది .. కొయ్యేరులో ఇళ్లన్నీ మునిగిపోతే కొండపైకి ఎక్కిన జనం కనిపించారు .. వారికి సంబంధించిన ఆటోలు , బైకులు , ట్రాక్టర్లన్ని కొండపైన కనిపిస్తున్నాయి .. నీళ్లల్లో మునిగిపోయిన ఇళ్లపైన కొంతమంది జనం కూర్చుని దిగులుగా చూస్తున్నారు .. మేము కెమేరాతో షూట్ చేస్తుంటే మమ్మల్ని చూసి మహిళలు ఏదో చెబుతున్నారు .. ఆ ద్రుశ్యాలన్ని షూట్ చేస్తూ మా పడవ దేవీపట్నం చేరింది .. అక్కడ దేవీ పట్నం పోలీస్ స్టేషన్ రెండో అంతస్తు వరకూ నీరు చేరింది .. పోచమ్మ తల్లి గుడి మొత్తం మునిగింది .. జనమంతా కొండమీద ఉన్న గుడిలోకి సమానంతా చేర్చుకుని అక్కడే కూర్చున్నారు .. కొంతమంది మాత్రం ఇళ్ల పై కప్పుల నీదే కూర్చున్నారు .. సామానంత ఐంటి పైకి చేర్చుకున్నారు .. కొండమీద బాదితులని చూస్తే చాలా బాదేసింది .. చిన్న చిన్న పసి పిల్లలని పెట్టుకుని జనమంతా ధీనంగా ఎదురు చూస్తున్నారు .. పిల్లలలకి పాలు లేవండీ అంటూ ఒక తల్లి చిన్న పసిపాపని చూపించి చెబుతోంది .. రాత్రి అర్దరాత్రి మా మొఖాన ఇంత కూడు పడేశారు .. ఇప్పుడు నాలుగవుతోంది ఇంతవరకూ గవర్నమెంటోళ్లు అన్నం పంపలేదు ఎట్టా బతకమంటారు అని అడుగుతోంది ఒక పెద్దావిడ .. ఇంకో పెద్దమ్మ అన్నం వండుతూ కనిపించింది .. గుడి సరిపోక పక్కనే ప్లాస్టిక్ కవర్లతో చిన్న టెంట్ మాదిరి ఏర్పాటు చేశారు ..


వాళ్లంతా ఉన్న చోట పెద్ద పెద్ద గొంగళిపురుగులు తిరుగుతున్నాయి .. రాత్రి పెద్ద పాము కూడా వచ్చిందట .. మా ముందే పెద్ద తేలుని వాళ్లు చంపి తెచ్చి మాకు చూపెట్టారు .. దాని విషం ఉన్న కొండెం తీసి మిగిలిన తోకని ఎండబెట్టారు.. ఎందుకూ అంటే ఆ తేలు తోక ని పూసల మాదిరిగా పిల్లలకి కడతామని చెప్పారు .. మంచినీళ్లు ఉన్నాయా అని అడిగితే ఒక పెద్దావిడ నీళ్లు ఇచ్చింది .. గోదారంతా అలా ఎర్రగా ఉంది కదా మీ దగ్గర ఈ మంచి నీళ్లు ఎక్కడివని అడిగితే .. నీళ్లల్లో పటిక అరగదీసి కలిపితే మురికంతా విడిపోయి కింద చేరుతుందన్నారు .. ఆ నీళ్లు చాలా స్వచ్చంగా ఉన్నాయి .. అక్కడ చాలా మంది నన్ను గుర్తు పట్టారు .. నన్ను చాలా సార్లు టీవీలో చూశారంట ..


ఇంకో పిల్లవాడు వచ్చి నేను కూడా పెద్దయ్యాక నీలా రిపోర్టర్ అవుతా.. అన్నయ్యా.. అంటూ నా మైక్ తీసుకుని నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు .. అన్నం వండుతున్న మహిళ నా దగ్గరకు వచ్చి అన్నం తింటావా అయ్యా ...అని అడుగుతుంటే అంత ఇబ్బందిలోనూ ఆ తల్లి చూపిన ప్రేమ నన్ను కదిలించింది .. గోదావరి జిల్లాలోళ్ల ప్రేమలు ఇంతలా ఉంటాయా అనిపించింది.


అక్కడి నుంచి కొండ దిగి మళ్లీ పడవ ఎక్కాం .. ఇక్కడే మాకు అసలు కష్టాలు మొదలయ్యాయి .. బోటు బయలుదేరిన కొద్దిసేపటికే వర్షం. స్టార్ట్ అయింది .. దానికి తోడు ఈదురుగాలి .. మాకు కనుచూపు మేరలో బోట్లేవీ కనిపించలేదు .. వర్షం కారణంగా బోట్లన్నీ ఆపేశారు .. నడిసంద్రంలో నావ ప్రయాణంలా సాగింది మా జర్నీ .. కసేపటికి వర్షం తగ్గుతుందేమో అనుకున్నాం . కానీ తగ్గలేదు .. ఇంకా పెరిగింది .. కెమేరా , 4G కిట్ తడవకుండా మా కెమెరామ్యాన్ లక్ష్మణ్ , టెక్నీషియన్ సుబ్బు వాటి పై రబ్బర్ ట్యూబ్ కప్పారు.. అయినా నీళ్లు వచ్చేస్తుంటే లైఫ్ జాకెట్లని వాటి పై కప్పారు .. అయినా తడుస్తోంటే వాళ్లింద్దరూ వాటి పై వంగి వర్షం పడకుండా కూర్చున్నారు .. బోటుకి ఈ చివరి ఎడ్జ్ మీద కూర్చున్న నేను గమ్యం చేరతామా అనుకున్నా .. ప్రమాదం ఏమీ ఉండదు కదా అని బోటు నడిపే అతన్ని అడిగా .. నేను మీకు ముందే చెప్పా .. ఈ బోటు వద్దు సార్ అని అయినా ఇక్కడి దాకా వచ్చారు .. తప్పదు ఇప్పుడు మీరు ఈ తిప్పలు పడాల్సిందే సాధ్యమైనంత తొందరగా మిమ్మల్ని తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నా కానీ బోటు ముందుకి వెళ్లడం లేదు అన్నాడు .. మీ దగ్గర లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా అవి జాగ్రత్తగా వేసుకోండి బోటులో ఎటూ కదలొద్దు అన్నాడు ..


పైన వర్షం తో వచ్చిన నీళ్లు బోటులో చేరుకుంటున్నాయి ..దీనికి తోడు కాస్త స్పీడ్ గా బోటు నడపడం వల్ల కింద నీరు ఎగిరి బోటులో పడుతోంది .. అప్పటికే పూర్తిగా తడిసిపోయాం ..వణుకు మొదలైంది .. దూరంగా గోదావరి ప్రళయంలా కనిపిస్తోంది .. వర్షం వల్ల కావొచ్చు .. గోదావరిలో అలల మాదిరిగా నీరు ప్రవహిస్తోంది .. ఇంకా ఎంతసేపు ఉంటుంది ప్రయాణం అన్నాను ఎందుకంటే వెళ్లేప్పుడు ఎంత సమయం పట్టిందో నేను గమనించలేదు .. ఇంకా అరగంట పడుతుంది . ఇంతకీ మీకు ఈత వచ్చా అని అడిగాడు బోటు నడిపే వ్యక్తి .. నాకు ఈత రాదు అని చెపి అతడు ఆ టైం లో ఎందుకు అలా డిగాడో నాకు అర్ధమైంది .. గాలి వేగానికి మా బోటు నది వైపు లాగెస్తోంది ..కొన్నిసార్లు బోటు ఒక పక్కకి లాగేస్తోంది .. గాలి వేగం మరింత పెరిగింది .. మాకు చావు చాలా దగ్గరగా కనిపించింది



ఇంతలో బోటు ఇంజిన్ ఆగిపోయింది .. మాకు ఒకవిధంగా చావు డిసైడ్ అయిపోయిందనుకున్నాను .. కర్రతో బోటుని ముందుకి నెడుతున్నాడు .. అయినా అది లాగేస్తోంది .. ఇంజిన్ కి ఏమైంది అన్నాను ..ఏమో తెలీడం లేదు .. ఎప్పుడూ ఆగలేదు అన్నాడు బోటు డ్రైవర్ .. ఒక పక్క ఇంజిన్ ని మళ్లీ స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఇంకో పక్క కర్రతో బోటుని నెడుతున్నాడు .. ఈ బోట్లకి తెడ్డు ఉండదు .. మేము ఏమైనా సాయం చేయమంటారా అంటే మీరు ఎమీ చేయొద్దు .. బోటులో అటూ ఇటూ కదలొద్దు .. బేలెన్స్ తప్పినా మీరు కంగారు పడి అటూ ఇటూ కదిలినా బోటు తిరగబడిపోద్ది .. నా వరకూ నేనైతే ఎన్ని కిలోమీటర్లైనా ఈదుకుంటూ వెళ్లిపోతా మీరే ఇబ్బంది పడతారు అన్నాడు .. మా సిచ్యువేషన్ మాకు అర్ధమైంది .. ఈ కాసేపు గడిస్తే చాలు మా ప్రాణాలు నిలబడినట్టే అనుకున్నాను .. బోటు వైపు నీళ్లలో ఒక పెద్దపాము ఈదుకుంటూ వస్తోంది .. అది ప్రాణాలు కాపాడుకోవడానికి బోటులోకి రావడానికి ప్రయత్నిస్తోంది .. దాన్ని చూడగానే కర్రతో గట్టిగా నీళ్లల్లో కొట్టి శబ్దం చేశాడు డ్రైవర్ .. దాంతో అది అటువైపు తిరిగి కరెంట్ వైర్లపైకి ఎక్కింది ..



ఆ సమయంలో జీవితం కళ్లముందు కదలాడింది .. నాకోసం ఎదురు చూసే భార్య, పిల్లలు , అమ్మ గుర్తొచ్చారు .. గట్టిగా అరవాలనిపించింది .. కాదు ఏడ్వాలనిపించింది .. గొంతు పెగల్లేదు .. ఏడుపు రాలేదు ..వర్షం మొదలయ్యే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశా .. అది ఇక్కడ పోస్ట్ చేశా .. వర్షం పెద్దది అయి ఇంజిన్ ఆగిపోయినప్పుడు ఇంకో వీడియో రికార్డ్ చేశా .. నాది ఐ ఫోన్ కాబట్టి తడిసినా ఏమీ కాదన్న ఉద్దేశంతో అలా వానలో ఫోన్ తడుస్తున్నా కానీ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశా .. మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము ఏ పరిస్తితుల్లో గోదారిలో కలిసిపోతున్నామో అన్ని విషయాలు రికార్డ్ చేశా ..ఇంతలో ఇంజిన్ మళ్లీ స్టార్ట్ అయింది .. మా ప్రాణం లేచొచ్చింది.


మీరు మరీ భయపడమాకండి సారూ మిమ్మల్ని ఒడ్డున పడేసే బాద్యత నాది .. నా ప్రాణాలు అడ్డేసైనా సరే మిమ్మల్ని ఒడ్డుకి చేరుస్తా అన్నాడు బోటు నడిపే వ్యక్తి .. అతను అంటున్నాడు కానీ గమ్యం చేరే వరకూ ప్రాణాలకి గ్యారంటీ లేదని డిసైడ్ అయిపోయా .. కళ్లు మూసుకుని భయంతో అలాగే మునగదీసుకుని కూర్చుండిపోయా .. కాసేపటికి మా కెమేరామ్యాన్ అంటున్నాడు సార్ ఒడ్డు కనిపిస్తోంది దగ్గరకు వచ్చేస్తున్నాం అని .. ఇంతలో మరో ప్రమాదం .. మమ్మల్ని తొందరగా గమ్యం చేర్చే ప్రయత్నంలో బోటు డ్రైవర్ బోటుని రెండు తాటి చెట్ల మధ్యలోంచి పోనిచ్చాడు .. దాటుతుండగా బోటు చివరి భాగం చెట్టుకి తగిలి కదిలిపోయింది .. అందరూ పెద్దగా అరిచారు.


బోటు ఒక పక్కకి లేచింది .. ఎవరూ లేవవద్దు అంటూ డ్రైవర్ అరుస్తున్నాడు .. బోటులోకి బాగా నీళ్లు వచ్చేశాయి .. అలా పైకి లేచిన బోటు తిరిగి నీళ్లలోకి ఒరిగింది .. కాస్త సర్దుకుని బేలన్స్ అయింది .. ఆల్రెడీ చావుకి ఫిక్స్ అయిపోయిన నేను దీనికి పెద్దగా స్పందించలేదు .. నానుంచి ఏ అరుపులూ రాకపోవడంతో అందరూ నన్నే వింతగా చూస్తున్నారు .. కొద్దిసేపటికి బోటు చినరమణయ్య పేట చేరింది ..


నాకు మరో జన్మ లభించినట్టయింది .. ఆనందంతో వెళ్లి బోటు నడిపే వ్యక్తిని గట్టిగా కావలించుకున్నాను .. నే... చెప్పాగా సారూ .. నా ప్రాణమైనా అడ్డేసి మిమ్మల్ని ఒడ్డుకి తెస్తానని అన్నాడు .. అతనికి డబ్బులు ఇవ్వబోయా .. కానీ వొద్దు సారూ .. మీ డబ్బులు మేమేం చేసుకుంటాం .. మీరొచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని థ్యాంక్స్ చెప్పారు కదా అది చాలన్నాడు.  నేను కాశ్మీర్ పేళుళ్ల సమయంలో , కొలంబో బ్లాస్ట్ సమయంలో , చత్తిస్ ఘర్ నక్సల్స్ కాల్పులప్పుడు , చెన్నై వరదలు , ఎన్నో తుఫాన్లు ఇలా ఎన్నెన్నో ప్రమాదకర సందర్భాల్లో న్యూస్ కవర్ చేశాను కానీ ఇంతలా ఇబ్బంది పడలేదు .. ప్రాణభయంతో అల్లాడలేదు .. బతికితే చాలు ఇంతలా ఎప్పుడూ దేవుడికి మొక్కలేదు .. కాసేపు ఇది పీడకలేమో అనుకున్నా కళ్లు మూసుకున్నప్పుడు ..కానీ ఈదురుగాలి , వరద ప్రవహ శబ్దం , బోటు ఇంజిన్ , వణికిస్తున్న చలి అన్నీ అది నిజమే అని గుర్తు చేస్తూనే ఉన్నాయి ..''



మరింత సమాచారం తెలుసుకోండి: