మంత్రులు పోయారు... నియోజకవర్గాలు కుప్పకూలాయి.. జిల్లాలకు జిల్లాలే తుడిచి పెట్టుకుపోయాయి! ఈ ఏడాది ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికార పక్షంగా ఉన్న టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. నమ్ముకున్న తమ్ముళ్లు జగన్‌ సునామీలో కొట్టుకుపోయారు. అంతకుమించి.. అన్న విధంగా నమ్మిన సెంటిమెంట్‌ తనను, పార్టీని కూడా శిథిలం చేసేసింది. మొత్తంగా మరోసారి అధికారంలోకి రావాలని భావించిన టీడీపీని ప్రజలు నిలువెత్తు గోతులో పడిపోయింది. 


అయినా.. కూడా ఇంకా ఏపీలోను, కేంద్రంలోనూ రాజకీయాలు తన చుట్టూ తానే తిరుగుతున్నాయని, తన గురించే పాలకులు ఆలోచిస్తున్నారని.. తన చుట్టూతానే రాజకీయాలు తిరుగుతున్నాయని అనుకుంటూ.. ఇంకా భ్రమల్లోనే జీవించేస్తున్నారు మాజీ అధికార పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు తన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని, వారు తనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని, త్వరలోనే కేసులు నమోదు చేయొచ్చని అంటూ.. కొత్తపల్లవి అందుకున్నారు. 


దీనికి కారణం.. ఏపీ సీఎం జగన్‌, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కలవడమే. నిజానికి ప్రస్తుతం జగన్‌ ఇజ్రాయెల్‌ సహా అమెరికా పర్యటనను ముగించుకుని తాడేపల్లికి రావడం, ఆవెంటనే ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, గడ్కరీలతోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి కీలక నేతలను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. 


పోలవరం సహా నవరత్నాల అమలుకు సంబంధించి నిధులు భారీగా విడుదల చేయాలని కూడా జగన్‌ వివరిం చారు. ఈ క్రమంలో వినతి పత్రాలను కూడా అందించారు. అయితే, అదేసమయంలో గత చంద్రబాబు పాలనలో జరిగిన దుబారా వ్యయాలు, ఖజానా విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు అనేవి చర్చకు రావడం సర్వసాధారణం. అంతే తప్ప.. చంద్రబాబుపై ఫిర్యాదులు చేయడం, లేదా వారిపై కేసులు పెట్టాలని జగన్‌ సూచనలు చేయడం అనేవి జరిగే ప్రక్రియలే కావు. దీనికి ప్రధానంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య వంటివారు.. బీజేపీతో చంద్రబాబు విభేదించినా.. వెంకయ్య వంటి వారు మాత్రం బాబుకు ఎప్పుడూ అండగా నిలిచారు. 


అలాంటి అత్యంత కీలకమైన నాయకులు ఢిల్లీలో చంద్రబాబుకు భుజం కాసేటప్పుడు.. జగన్‌ ఎన్నిమార్లు అరిచి గీపెట్టినా ప్రయోజనం ఉండదు. మరోపక్క, జగన్‌ కూడా బాబును బోను ఎక్కించాలని అనుకుంటే.. అదితనకే రాజకీయంగా నష్టమని తెలియని వాడు కాదు. ఏ విషయాన్నయినా సెంటిమెంటుతో ముడిపెట్టి తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబును రాజకీయంగా తన వ్యాఖ్యలతోనే ఇరుకున పెట్టడం జగన్‌ లక్ష్యం తప్ప.. ఆయనను జైలు పంపడం అనేది ఎప్పటికీ కాదు. పోనీ.. ఒక వేళ కేంద్రానికి ఫిర్యాదులు చేసినా.. వారు పట్టించుకునే పరిస్థితి లేనేలేదు. 


తమ అధికారానికి అడ్డువస్తేనే బీజేపీ నేతలు మోడీ కానీ,షా కానీ చర్యలు తీసుకుంటారు తప్ప.. తమకు ఏమాత్రం అడ్డుకారని తెలిస్తే.. పట్టించుకునే ప్రసక్తే లేదు. ఇన్ని విషయాలు తెలిసి కూడా.. చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా పోయిన సింపతీని వెతుక్కుంటున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: