తెలంగాణ స‌చివాల‌యం త‌ర‌లింపు దాదాపు పూర్తి కావ‌చ్చింది. కొత్త స‌చివాల‌యం నిర్మాణం నేప‌థ్యంలో ప్ర‌స్తుం ఉన్న స‌చివాల‌యంలోని శాఖ‌ల‌ను అధికారులు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయా శాఖ‌ల‌కు భ‌వ‌నాలు కేటాయించ‌డం, ఆయా ఫ్లోర్లు కేటాయించ‌డం పూర్త‌యింది. శ్రావణ శుక్రవారం మంగళప్రదమైన రోజు కావడంతో… పలు శాఖల ఉన్నదాధికారులు విధులు ప్రారంభించారు.  శ్రావణ శుక్రవారానికి తోడు… దశమి రావడంతో ఈ దివ్యమైన ఘడియల్లో పనులు ప్రారంభించేందుకు మొగ్గుచూపారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటలక 21 నిమిషాలకు దశమి ఘడియలు ప్రవేశించ‌డం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు శుభఘడియలున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా త‌ర‌లింపు ప్రక్రియ జోరుగా కొనసాగింది.


ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఛాంబర్లను రసూల్‌పురలోని మెట్రో రైల్ భవన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి మూడో అంతస్తులో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మలకు ఛాంబర్లు కేటాయించనున్నారు. సీఎంఓ మెట్రో భవనం నాలుగో అంతస్తులోకి వెళ్లనుంది. అయితే సీఎంఓలోని అధికారుల పేషీలను మాత్రం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓ ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, బీర్కేఆర్ భవన్ నుంచి విధులు ప్రారంభించారు. ఆయన పేషీల కోసం బీర్కేఆర్ భవన్‌ 9వ అంతస్తు బి-బ్లాక్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.


దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బొగ్గులకుంటలోని కమిషనరేట్‌కు మారారు. మిగతా మంత్రుల ఛాంబర్లు, వాళ్ల పేషీలకు బీర్కేఆర్ భవన్‌ మొదటి అంతస్తును కేటాయించారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయానికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లోకి వెళ్లాలని భావిస్తున్నారు.మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బీఆర్కేఆర్ భవన్‌లోనే జీఏడీతో పాటు కొలువుదీరనున్నారు. అయితే ఆ శాఖలోని వివిధ సెక్షన్లు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్ కు మారనున్నాయి. ఇక సీఎంఆర్ఎఫ్ విభాగం, వివిధ యూనియన్ల కార్యాలయాలు, కో ఆపరేటివ్ సొసైటీ, పోస్ట్ ఆఫీస్, డిస్పెన్సరీలు, స్కూళ్లు, శిశువిహార్లు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే వెళ్లనున్నాయి.
ఇదిలాఉండ‌గా, కార్యాలయాల తరలింపు నేపథ్యంలో ఆర్థిక శాఖలో సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు. సెక్షన్లను వెంటనే తరలించాలని పీఎఫ్ఎస్ ఆదేశించారు. సచివాలయంలోని వివిధ శాఖల తరలింపు నేపథ్యంలో బీఆర్కేఆర్ భవన్‌లో యుద్ధప్రాతిపదికన రిపేర్లు పూర్తి చేస్తున్నారు. నాలుగు రోజులు వరుస సెలవులు ముగిసేలోపు తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బూర్గుల రామకృష్ణారావు భవన్‌ పూర్తిగా ఎస్పీఎఫ్ భద్రతావలయంలోకి వెళ్లిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: