జమ్మూకశ్మీర్‌‌‌‌కు స్పెషల్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశంలో విభిన్న‌మైన స్పంద‌న వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సమయంలో.. ఎటువంటి గొడవలు జరకుండా జమ్ముకశ్మీర్ అంతటా భారీ స్థాయిలో సాయుధ బలగాలను మోహరించడంతో పాటుగా కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించింది. తాజాగా జమ్ములో ఇప్పటికే 144 సెక్షన్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు మెరుగుప‌డుతున్నాయి.


జమ్మూలో స్కూళ్లు తెరచుకున్నాయి. షాపులు, మాల్స్, దుకాణాలు కూడా ఓపెన్ చేశారు. సరుకుల కోసం జనం బయటకు వస్తున్నారు. పోలీసులు అడుగడుగునా భద్రత కల్పిస్తున్నారు.  విధుల్లో ఉన్న పోలీసులకు జమ్ములోని స్థానికులు సహకరిస్తున్నారు. స్కూళ్లకు తీసుకెళ్తున్నప్పుడు.. మార్కెట్ కు వెళ్తున్నప్పుడు.. పోలీసులను చూసి చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఆయుధాలు పట్టిన పోలీసులకు చిన్నపిల్లలు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంద‌ర్భంలోని ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓ పిల్లాడు రోడ్డుపై గస్తీ కాస్తున్న ఓ సీఆర్పీఎఫ్ మహిళా పోలీస్‌కు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు తీసిన ఫొటో అది. థాంక్స్ పోలీస్ అంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటో భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


కశ్మీర్ లోయలో 144 సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. బక్రీద్ సమయానికి ఆంక్షలు ఎత్తేస్తామని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. జమ్ముకశ్మీర్ లో బక్రీద్ కోసం వేలసంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు సిద్ధంగా ఉన్నాయని..నిత్యావసరాలకు ఇబ్బంది లేదని చెప్పారు. పట్టణ యువత ఆర్టికల్ 370  రద్దుపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జమ్ముకశ్మీర్ కు మంచిరోజులు వస్తాయని  కొందరు యువతీయువకులు ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇదిలాఉండ‌గా, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ ఒమ‌ర్ అబ్దుల్లాకు చెందిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఆ పార్టీ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌ను కూడా త‌ప్పుప‌డుతూ కోర్టులో పిల్ వేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: