వ్యవసాయంలో వస్తున్న మార్పులతో సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్నది. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు వ్యవసాయరంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. రైతు రుణాలు, గిట్టుబాటు ధరలు, యంత్రాలు, పనిముట్లు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, గోడౌన్లు, సరైన మార్కెట్‌ సౌకర్యం కల్పించాల్సిన సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ట్రాక్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తున్నా..అర్హులైన రైతులకు చేరడంలేదు.  ప్రతి ఎకరాను భూసార పరీక్షలు చేసి, ఆ రిపోర్టు ఆధారంగా పంటలు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికి, అది మాటలకే పరిమితమైంది.  ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరిగిపోయి వ్యవసాయం చేయలేని పరిస్థితులు వచ్చాయి. యాంత్రీకరణ కోసం నిధులు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతున్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఆధునిక మునిముట్లు అందుబాటులో లేకపోవడం, ట్రాక్టర్లకు కిరాయిలు భారీగా పెరిగిపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎడ్లతోనైనా సాగు చేద్దామంటే గడ్డిలేక, మేత మేసేందుకు బీడు భూములు తగ్గిపోవడంతో వాటి మనుగడ కూడా కష్టమైంది. ఎద్దులతో వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.



వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం ఆధునిక పనిముట్లు, పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచడం లేదు. 
యంత్రలక్ష్మి పథకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రాష్ట ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో ఈ పథకం నిర్వీర్యమైంది. కేంద్రం తన వాటాలో మొదటి విడత సగం చెల్లించింది.  కేటాయించక పోవడంతో 
పాత పద్ధతుల్లో సాగు చేయలేక, కొత్త పద్ధతులను అందుకోలేక రైతన్న సతమతమవుతున్నారు. దీంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో పదేండ్ల నుంచి ఆహార, పప్పుధాన్యాల పంటల సాగు తక్కువై పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల సాగు విపరీతంగా పెరిగిపోయింది. ఆమేరకు రైతుకు సాగు భారం పెరుగుతున్నది.



మరోవైపు యంత్రాలతో వ్యవసాయం చేయాలంటే రైతుకు భారంగా తయారైంది. దుక్కి దున్నాలన్నా, దమ్ము చేయాలన్నా, గొర్రు కొట్టాలన్నా, గుంటుకలు తోలాలన్నా అనేక ట్రాక్టర్లనే ఆశ్రయించాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఒక్క యంత్రం కూడా మంజూరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవని రైతు సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయంపై ఆశచావని రైతులు ఎంతఖర్చయినా ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరగడం, ఇదే సమయంలో డీజిల్‌ ధరలు అధికం కావడంతో ట్రాక్టర్ల కిరాయిలు అమాంతం ఆకాశానికి చేరాయి. ఒక్కో ఊర్లో ఒక్కో విధంగా కిరాయిలు ఉన్నాయి. గంటకు రూ 1000 నుంచి రూ 1500 ఇస్తే గానీ పొలం దున్నడానికి వచ్చే పరిస్థితులు లేవు. అదును సమయంలో ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని రైతులు తెలిపారు.



రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వానలతో నాట్లు పెట్టడానికి ట్రాక్టర్ల కోసం ఇబ్బందిపడాల్సి వస్తున్నదనీ, కరిగట్టు దున్ని నాటుకు సిద్ధం చేసే కల్టివేటర్‌ ట్రాక్టర్‌ కిరాయి గంటకు రూ1700 తీసుకుంటున్నారనీ, ఎకరానికి రూ 12వేల వరకు ఖర్చువుతున్నదని గజ్వేల్‌ కు చెందిన రైతు రాంప్రసాదు అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేద రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. రైతుల సంక్షేమ కోసం ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ పథకాలు సైతం రైతులకు ఊరట కలిగించడం లేదు. పంటరుణాలు అందకపోవడం, అర కొర పెట్టుబడి సాయంతోసాగు కష్టమైపోతున్నది. సాగుకు ఖర్చు లు పెరిగిపోవడంతో రైతులు అప్పులపాలై, వాటిని తీర్చలేక రైతులు ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. రైతు బంధు, రైతు బీమా, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ కూడా రైతులను కష్టాలనునుంచి బయటపడేయలేక పోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: